ఆరుపడై వీడులలో.. స్కంధ షష్టి మహోత్సవం
తమిళ్ కడవుల్ మురుగన్‌కు తమిళనాట ఉన్న ఆరు పడై వీడుల్లో స్కంధ షష్టి మహోత్సవం అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య ఘట్టం సూర సంహారం సోమవారం జరగనున్నది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు తిరుచెందూరువైపుగా భక్తజనం పోటెత్తుతున్నారు. చైన్నె నుంచి తిరుచెందూరు, తిరునల్వేలికి ప్రత్యేక రైళ్లను సైతం పట్టాలెక్కించారు.
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరుచెందూరులో సెంథిల్ ఆండవర్, జయంతి నాథర్‌గా, తిరుప్పర కుండ్రంలో ముత్తుకుమార స్వామిగా, పలముదిర్ చోళైలో మురుగన్‌గా, తిరుత్తణిలో బాల సుబ్రమణ్యన్‌గా, పళనిలో దండయుధ పాణిగా, స్వామి మలైలో స్వామినాథగా ఆరుపడై వీడులలో తమిళ్ కడవుల్ మురుగన్ కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయాలలోనే కాదు సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన ప్రాంతాలలో స్కంధ షష్టి ఉత్సవాలు గతం కొద్ది రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. చైన్నెలోని వడపళణి , శిరువాపురి, కంద కోట్టం, కుండ్రత్తూరు, నంగనల్లూరు మురుగన్ ఆలయాలు, సేలం అమ్మపేట కుమర గురు సుబ్రమణ్య స్వామి తదితర ఆలయాలలో సైతం స్కంధ సష్టి భక్తి మిన్నంటోంది. పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో ఆలయ పరిసరాలలో హరోహర నామస్మరణ మిన్నంటుతోంది. అన్ని ఆలయాలలో సోమవారం సూర సంహార ఘట్టాలు కనుల పండవుగా జరగనున్నాయి.
నేడు సూర సంహారం
తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ స్కంధ సష్టి ఉత్సవం కనుల పండువగా సాగుతుంది. యాగశాల పూజతో ఉత్సవాలకు ఈనెల 22వ తేదీన శ్రీకారం చుట్టారు. ఈ ఆలయంలో జరిగే సూర సంహార ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలలో భక్తులు తరలి రావడం జరుగుతుంది. సముద్ర తీరం ఒడ్డున ఈ మహోత్సవ ఘట్టం జరుగుతుంది. దీనిని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుచెందూరువైగా ఆదివారం కదిలారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఓవైపు ప్రత్యేక బస్సులు రోడ్డెక్కించారు. ప్రత్యేక రైళ్లు చైన్నె నుంచి కదిలాయి. సోమవారం వేకువజామున 1.30 గంటలకు విశ్వరూప దర్శనం, 2 గంటలకు ఉదయ మార్తాండ పూజ జరగనుంది. 6 గంటలకు స్వామి వారు యాగశాలకు చేరుకుంటారు. ఇక్కడ జరిగే పూజలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు జయంతి నాథర్ షణ్ముగ విలాస మండపం విచ్చేయనున్నారు. 2 గంటలకు తిరువాడుదురై షష్టి మండపంలో అభిషేకం, అలంకరతో నాలుగున్నర గంటలకు సముద్ర తీరం వైపుగా సూరుడ్ని సంహరించేందుకు బయలుదేరుతారు. అద్వితీయంగా జరిగే ఈ ఘట్టాన్ని ముగించుకుని సంతోష మండపంకు చేరుకునే స్వామి వారికి అభిషేకాది పూజలు నిర్వహిస్తారు.మరుసటి రోజు మంగళవారం అమ్మ వారి తపస్సు ఘట్టం, స్వామి అమ్మవారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగనుంది.
లక్షల్లో తరలిరానున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
సముద్ర తీరంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్రంలోకి జనం చొచ్చుకెళ్లకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆలయం పరిసరాలలో అనేక చోట్ల భద్రతా గోపురాలు ఏర్పాటు చేశారు. 250కు పైగా ప్రాంతాలలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించారు. ఆలయం పరిసరాలలలో 3 వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. సూర సంహారం వేడుకనుమరింత సులభంగా భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్కీన్లను అక్కడక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు వైద్య సేవల నిమిత్తం 20 మంది డాక్టర్లు, 50 మంది నర్సులతో పాటుగా 15 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. తిరుచెండూరు బస్టాండ్ నుంచి ఆలయం వద్దకు ఉచితంగా బస్సులను నడిపేందుకు చర్యలుతీసుకున్నారు. సముద్రంలో పడవల ద్వారా సుమారు వంద మందికి పైగా గజ ఈత గాళ్ల సహకారంతో గస్తీకి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చేసిన ఏర్పాట్లను ఎంపీ కనిమొళి పరిశీలించారు. ఒట్ట పిడారం ఎమ్మెల్యే షణ్ముగయ్య, తూత్తుకుడి కలెక్టర్ ఇలం భగవత్, ఎస్పీ ఆల్బర్ట్ జాన్ , తిరుచెందూరు మున్సిపల్‌చైర్మన్ శివనాండి, ఆలయ ట్రస్తీ అరుల్ మురుగన్ ఏర్పాట్లను కనిమొళికి వివరించారు.
ఆరుపడై వీడులలో.. స్కంధ షష్టి మహోత్సవం
ఆరుపడై వీడులలో.. స్కంధ షష్టి మహోత్సవం


