భిక్షగత్తె అనుకుని!
చౌడేపల్లె: ఆమె ఎందుకొచ్చిందో.. ఎక్కడికొచ్చిందో తెలియదు. ఊరుగాని ఊరు వచ్చి బస్ షల్టర్‌లో చిక్కుకుపోయారు. మూడు రోజులుగా వర్షాల కారణంగా అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఎవరో భిక్షగత్తె అనుకుని స్థానికులు చేరదీసి ఆదరించారు. శనివారం ఉన్నట్టుండి అపస్మారక స్థితి చేరుకుని మృతిచెందారు. హెడ్ కానిస్టేబుళ్లు మస్తాన్, జయశంకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మహిళ భుజానికి ఉన్న బ్యాగ్‌ను పరిశీలించారు. ఆమె పేరు రామలక్ష్మి(60)గా నిర్ధారించారు. ఆమెది ధనపాల్‌చెట్టి స్ట్రీట్, ముత్తుపాళెం, సిద్ధిపేట, చైన్నెగా బ్యాగులోని ఆధార్, బ్యాంకు పుస్తకాలను బట్టి గుర్తించారు. బ్యాగులో ఉన్న రూ. 1.08 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చైన్నె కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు ఖాతా పుస్తకాలను పరిశీలించారు. బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.4 లక్షల మేర బ్యాలెన్స్ ఉన్నట్టు స్టేట్‌మెంట్‌ను బట్టి గుర్తించా రు. పర్సులో కొన్ని నగలు సైతం ఉండడంతో.. ఫోన్‌బుక్‌లో ఉన్న తన కుమార్తె పళణిఎమ్మాల్‌కు సమాచారమిచ్చారు. రామలక్ష్మి చౌడేపల్లెకు ఎందుకొచ్చారు.. ఎలా వచ్చారో తెలియడం లేదు.
పలమనేరుకు వెళ్లాల్సింది పోయి..
గత మూడు రోజుల క్రితం ఆమె చౌడేపల్లెలో పలమనే రుకు వేళ్లేందుకు ఆటోలో ఎక్కాల్సి ఉండగా పొరపాటున తిరుపతి వైపు వెళ్లే ఆటో ఎక్కినట్టు స్థానికులు చె బుతున్నారు. చౌడేపల్లెకు 2కి.మీ దూరంలో ఆటో వెళ్తుండగా మహిళను డ్రైవర్ ప్రశ్నించాడు. పలమనేరుకు వెళ్లాలని సమాధానమివ్వగా ఆమినిగుంట బస్‌షెల్టర్ వద్ద ఆ మహిళను ఆటోలో నుంచి దింపేశా రు. ఆమెకు తెలుగు రాదు. మూడు రోజులుగా బస్‌షెల్టర్‌లోనే తలదాచుకున్నారు. చలికి వణుకుతూ అపస్మారస్థితికి చేరుకుని మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహా న్ని పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
భిక్షగత్తె అనుకుని!


