హోంగార్డులు వైద్యపరీక్షలు చేసుకోవాలి
వేలూరు: పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులు తరచూ విధి నిర్వహణలో ఉండడంతో వైద్య పరీక్షలు చేసుకోవాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అన్నారు. వేలూరులోని తలమురైపేరవై, శ్రీనారాయణి ఆస్పత్రి ఆధ్వర్యంలో జీవీ సెల్వం జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని వేలూరు పోలీస్ కల్యాణ మండపంలో జిల్లాలోని హోంగార్డులకు ప్రత్యేక వైద్యశిబిరం, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. శిబిరానికి వేలూరు డీఐజీ ధర్మరాజ్ అధ్యక్షత వహించగా జీవీ సెల్వం మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే నేడు హోంగార్డులకు వైద్యశిబిరం నిర్వహించి అవసరమైన వైద్య సదుపాయాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వేలూరు డీఐజీ ధర్మరాజ్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో హోంగార్డుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తక్కువ వేతనంతో పోలీసులతో సమానంగా ట్రాఫిక్‌లో నిలబడి క్రమబద్ధీకరిస్తారన్నారు. ట్రాఫిక్‌తో పాటు బందోబస్తులోనూ తరచూ పాల్గొంటున్న హోంగార్డులకు పని ఒత్తిడి తప్పకుండా ఉంటుందన్నారు. వాటి నుంచి బయట పడాలన్నారు. అనంతరం ప్రభుత్వ సిద్ధ వైద్యులు తిల్‌లైవాణన్ పాల్గొని తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన పద్ధతులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. హోంగార్డుల అసిస్టెంట్ కమాండో జనరల్ సురేష్, ఏరియా కమాండో కుమరన్, అసిస్టెంట్ కమాండోలు అర్చన, గణేష్, వినోద్, తలమురై పేరవై నిర్వహకులు శ్రీనివాసన్, భూమినాథన్, మారన్ అసోషియేషన్ మేనేజింగ్ డైరెక్టర్, న్యాయవాది పీడీకే మారన్, సతీష్‌కుమార్, కేఎస్ సుందర్ పాల్గొన్నారు.


