
కంట్రోల్ రూంలో డిప్యూటీ సీఎం పర్యవేక్షణ
సాక్షి, చైన్నె: చైన్నెలో భారీ వర్షం పడుతుందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో రాత్రంతా డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ స్టేట్ కంట్రోల్ రూమ్ ఎళిలగంలో తిష్ట వేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. చైన్నెలో 215 శిబిరాలను ఏర్పాటు చేసి, లక్షా 46 వేల మందికి సరిపడ్డ ఆహారం తదితర అన్ని రకాల వస్తువులను సిద్ధం చేయించారు. అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని, ఎలాంటి విపత్తు ఎదురైనా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిద్దామన్న పిలుపుతో ఉరకలు తీశారు. ఏదేని విపత్తు ఎదురైన పక్షంలో పోటీ పడి మరీ ప్రజలకు సేవలు అందించాలని అటు అధికారులు, సిబ్బందికి , ఇటు డీఎంకే కేడర్‌కు ఆయన పిలుపు నిచ్చారు. కాగా చైన్నె శివారులలో కురిసిన వర్షానికి తిరుముల్‌లై వాయిల్ రోడ్డులో వరదలు పోటెత్తడంతో వాహనదారులకు అవస్థలు తప్పలేదు. యుద్ధ ప్రాతిపదికన నీటిని తొలగించారు. చైన్నె నీరు అందించే చెంబరంబాక్కం, పూండి రిజర్వాయర్లలోకి నీటి రాక పెరగడంతో అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. చైన్నెలోని కోడంబాక్కం, మైలాపూర్‌లలో చెట్లు నేల కొరగగా ఆగమేఘాలపై తొలగించారు. చైన్నెలో అత్యధికంగా తిరుముల్‌లై వాయిల్, ఆవడి పరిసరాలలో 10 నుంచి 12 సెం.మీవర్షం పడింది. కాగా చైన్నెలో 107 ప్రాంతాలలో వర్షపు నీటి కాలువల పనులు ముగిసినా, ప్రధానకాలువలోకి అనుసంధానించని దృష్ట్యా, ఇక్కడ నీటిని తొలగించేందుకు ముందు జాగ్రత్తగా మోటారు పంపు సెట్లను సిద్ధం చేశారు. కాగా కూవం నదిలో ఓ వృద్ధుడు నీటిలో కొట్టుకెళ్లగా, అతడిని స్థానికులు రక్షించారు. చైన్నెకుతాజాగా అతి భారీ వర్షం గండం తాత్కాలికంగా తప్పినా, ఈ పవనాల రూపంలో మళ్లీ వర్షాలకు అధిక అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరిలతో పాటూ పలు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ను గురువారం ప్రకటించారు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో జాలర్లు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి.