
పట్టాభిరాంలో పేలుడు
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని పట్టాభిరాంలో ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఓ ఇంట్లో పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పేలింది నాటు టపాసులా లేదా నాటు బాంబులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వివరాలు.. చైన్నె శివారులోని ఆవడి పరిధిలోని పట్టాభిరాంలో ఆదివారం రెండున్నర గంటల సమయంలో హఠాత్తుగా ఓ ఇంట్లో నుంచి భారీ శబ్దంతో పేలుడు చోటు చేసుకుంది. దీంతో పరిసరవాసులు ఉలిక్కి పడ్డారు. 20 నిమిషాలపాటూ పేలుళ్లతో ఆ ఇళ్లు 75 శాతం నేలమట్టం కావడంతో పరిసర వాసులు ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. ఆవడి పరిసరాల నుంచి అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. శిథిలాల కింద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను గుర్తించారు. భారీ విస్పోటం జరిగే విధంగా పేలుడు జరగడంతో పేలింది నాటు టపాసులా లేదా నాటు బాంబులా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఛిద్రమైన మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల వివరాలను సేకరించారు. మృతులలో తిరునెండ్రవూరుకు చెందిన యాసిన్(25), సునీల్(23) గుర్తించారు. మరో ఇద్దరు కూడా మరణించగా పేర్లు తెలియాల్సి ఉంది. అయితే, పేలుడు అనుమానాలకు దారి తీయడంతో ఆవడి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పేలింది నాటు బాంబులు అన్న అనమానాలు రావడంతో విచారణ వేగవంతం చేశారు. ఇటీవల కాలంగా వస్తున్న బాంబు బూచీల నేపథ్యంలో తాజాగా ఈ పేలుడు జరగడంతో మృతి చెందిన వారు ఏదేని కుట్రలకు వ్యూహ రచన చేస్తు్‌ండగా ఈ ఘటన చోటు చేసుకుందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆవడిలోని దండురై ప్రాంతం అదల్ పట్టాభిరామ్‌లోని వ్యవసాయ వీధికి చెందిన ఆర్ముగం(50) కుమారుడు విజయ్ శ్రీపెరంబదూరు పరిసరాల నుంచి నాటు టపాసులు కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముత్తున్నట్టుగా కూడా విచారణలో వెలుగు చూసింది. మరణించిన ఇద్దరు బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చినట్టుగా భావిస్తున్నారు.

పట్టాభిరాంలో పేలుడు