
పూండి రిజర్వాయర్ సందర్శన
తిరువళ్లూరు: పూండి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరిన క్రమంలో దిగువకు మిగులు జలాలను అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను పరిశీలించారు. చైన్నెకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్ సత్యమూర్తిసాగర్ రిజర్వాయర్. రిజర్వాయర్ నీటి మట్టం 35 అడుగులు. గత కొద్ది రోజులుగా ఆంధ్రా, వేలూరు, రాణిపేట నుంచి వచ్చిన వరదలతో రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. దీంతో గత నాలుగు రోజుల క్రితం సెకనుకు 4వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్‌కు 2వేల క్యూసెకుల నీరు వస్తోంది. దీంతో అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రతాప్, ఆర్డీఓ రవిచంద్రన్, తహశీల్దార్ బాలాజీతోపాటు ఇతర ఉన్నతాధికారులు పూండి రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, కరకట్ట బలోపేతం, ముంపు గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుతోపాటు ఇతర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. దీంతో పాటు షట్టర్ల పనితీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్, అధికారులు అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు.