నేడు వెలుగుల పండుగ | - | Sakshi
Sakshi News home page

నేడు వెలుగుల పండుగ

Oct 20 2025 7:44 AM | Updated on Oct 20 2025 7:44 AM

నేడు

నేడు వెలుగుల పండుగ

రాష్ట్రంలో దీపావళి సందడి భద్రత కట్టుదిట్టం ప్రజలకు నేతల శుభాకాంక్షలు స్వస్థలాలకు తరలిన జనం జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక శాఖ సూచన టాస్మాక్‌లో పూటుగా మద్యం జోరుగా బాణసంచా విక్రయాలు

రాష్ట్రంలో ఆదివానం దీపావళి సందడి నెలకొంది. ఇక అన్ని మాల్స్‌, వాణిజ్య కేంద్రాల్లో వ్యాపారం జోరుగా సాగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. చైన్నె నుంచి మూడు రోజులలో 12 లక్ష మందికి పైగా జనం స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇక పండుగ వేళ టాస్మాక్‌ మద్యం దుకాణాలలో పూటుగా స్టాక్‌ను నిల్వ ఉంచారు. బాణసంచాల విక్రయాల పెద్దఎత్తున సాగుతున్నాయి.

సాక్షి, చైన్నె: వెలుగులు వెదజల్లే దీపావళి పండుగను సోమవారం ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. పండుగను ఘనంగా జరుపుకునే విధంగా ఆదివారం రాత్రి నుంచి అనేక చోట్ల బాణసంచా కాల్చే వాళ్లు అధికం అయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటూ చైన్నె నగరంలోని టీ నగర్‌, పురసై వాక్కం, ప్యారీస్‌, తాంబరం, రాయపురం పరిసరాల్లోని అన్ని వాణిజ్య కేంద్రాలు, కొనుగోలు దారులతో కిటకిట లాడాయి. అన్ని ప్రాంతాలూ సందడిగా కన్పించాయి. కొత్త బట్టలు, పండుగకు అవసరమయ్యే వస్తువులు, స్వీట్ల, ఇతర పూజా సామగ్రి వ్యాపారం జోరుగా జరిగింది. ఇసుకేస్తే రాలనంతంగా జనం తరలి రావడంతో వ్యాపార కేంద్రాల్లో వర్తకం మరింతగా పుంజుకుంది. పూజా సామాగ్రి, పండ్లు, ఫలాలలు, పువ్వుల ధరలకు రెక్కలు వచ్చాయి. షాపింగ్‌ కేంద్రాలు, పురాతన భవనాలు విద్యుత్‌ వెలుగులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.

నిఘా కట్టుదిట్టం

దీపావళి పర్వ దినం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెతో పాటూ అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘాతో వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. గత నెల రోజులుగా వస్తున్న బాంబు బెదిరింపు ఘటనల దృష్ట్యా, మరింత జాగ్రత్తలు పాటించే రీతిలో చర్యలు తీసుకున్నారు. చైన్నెలో 18 వేల మందితో భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది సిబ్బంది భద్రతా విధులలో నిమగ్నమయ్యారు. ఇక బాణసంచా కాల్చే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎలా పేల్చాలో అవగాహన కల్పించే రీతిలో అగ్ని మాపక శాఖ వర్గాలు తమ తమ పరిధుల్లో అవగాహన ప్రచారం నిర్వహించాయి. ప్రధానంగా గుడిసె ప్రాంతాల్లో రాకెట్లు, గాల్లో పేలే ఇతర రంగు రంగుల బాణా సంచాల్ని నిషేధించాలని విన్నవించుకున్నారు. చైన్నెలో 100 చోట్ల 1,100 మందితో అగ్నిమాపక సిబ్బందిని బృందాలు బృందాలుగా అత్యవసర సేవలకు నియమించారు. ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు, రాత్రి 7 నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చాలని లేని పక్షంలో చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే గుడిసె ప్రాంతాలకు సమీపంలో అగ్నిమాపక వాహనాల్ని ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు. ఏదేని ప్రమాదాలు జరిగిన పక్షంలో బాఽధితులకు వైద్య చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో వార్డుల్ని సిద్ధం చేసి ఉంచారు. కాగా ఉత్సాహంగా, ప్రమాద రహితంగా పండుగను జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం, మాజీ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌, డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్‌, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌ వంటి రాజకీయ పక్షాల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.

లక్షలాదిగా స్వస్థలాలకు జనం

చైన్నె నగరంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లంతా తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. గత రెండు రోజులుగా ప్రత్యేక బస్సులు, రైళ్లు పరుగులు తీస్తున్నాయి. చైన్నె నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు, రైళ్లలో గురు, శుక్ర,శని వారాలలో సుమారు 12 లక్షల మందికి పైగా స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. శని, ఆదివారం సెలవులు, సోమవారం పండుగ సెలవు, మంగళవారం అదనంగా ఓ రోజు సెలవును ప్రభుత్వం కేటాయించడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు జనం బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల, విమానాశ్రయాల వద్ద క్యూకట్టారు. కిలాంబాక్కం బస్టాండ్‌లో అయితే దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లేందుకు వేకువజామున మూడు గంటల వరకు జనం క్యూకట్టారు. ఇక అనేక మార్గాలలో ట్రాఫిక్‌ పద్మవ్యూహం తప్పలేదు. జాతీయ రహదారిలోని టోల్‌గేట్ల వద్దు కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులుదీరాయి. అలాగే, మందు బాబుల కోసం రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో వివిధ రకాల బ్రాండ్లను మార్కెటింగ్‌శాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. పండుగ రోజున రూ. 500 కోట్లకు పైగా విక్రయాలే లక్ష్యంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

నేడు వెలుగుల పండుగ
1
1/1

నేడు వెలుగుల పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement