
కరూర్ బాధితులకు టీవీకే పరిహారం పంపిణీ
తమిళసినిమా: గత నెల 27న కరూర్ జిల్లా, వేలుసామి పురంలో తమిళగ వెట్రికళం పార్టీ తరుపున ఆ పార్టీ అద్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొందరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు తీవ్ర ద్విగ్బ్రాంతికి గురి అయిన విజయ్ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో మృతి చెందిన ఒక్కొక్కరికి నష్టపరిహారంగా రూ.20 లక్షలు, గాయాల పాలైన వారికి తలా రూ.2 లక్షలు అందించినున్నట్లు ప్రకటించారు. ఈయన ఇచ్చిన మాట ప్రకారం శనివారం మృతుల కుటుంబాల బ్యాంకు ఖాతాలకు పరిహారం అందజేశారు. అదేవిధంగా గాయాల పాలయిన వారి బ్బాంకు వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు ఆ పార్టీ నిర్వాహకులు వెల్లడించారు. దీంతో నష్ట పరిహారం అందిన వారి కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విజయ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కాగా గాయపడిన వారిని త్వరలో విజయ్ నేరుగా కలిసి ఓదార్చుతారని పార్టి నిర్వాహకులు పేర్కొన్నారు.
విజయ్ ప్రజల ముందు
నటించరు..
కాగా నటుడు, తమిళగ వెట్రి కళంగం పార్లీ అద్యక్షుడు విజయ్ ప్రజల ముందు నటించరు అని నటి నీలిమా పేర్కొన్నారు. ఈమె తిరుపాచ్చి చిత్రంలో నటుడు విజయ్‌కు చెల్లెలిగా నటించి గుర్తుంపు పొందారు. కాగా నటి నీలిమా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ప్రకటనలో పేర్కొంటూ విజయ్ షూటింగ్‌లో షాట్ పూర్తి కాగానే పక్కకు వచ్చి సైలెంట్‌గా కూర్చుంటారని, ఎవరితోనూ మాట్లాడరని ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడతారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఏమౌతుందో అని అందరూ భావించారన్నారు. అయితే ఆయన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయనలో చాలా మార్పు వచ్చిందన్నారు. విజయ్ చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారారని, ఆయన్ని ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. విజయ్ ప్రజల ముందు నటించరని, ఆయన రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టం అని నటి నీలిమ పేర్కొన్నారు.