
చైన్నెకి.. వరుణ గండం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల రూపంలో చైన్నె, శివారు జిల్లాలకు తుపాన్ గండం పొంచి ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో ముందస్తు చర్యలు మరింత విస్తృతంపై అధికారులు దీపావళి మరుసటి రోజు నుంచి దృష్టి పెట్టనున్నారు. అలాగే అధికారులతో సమావేశానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. వివరాలు.. ఈశాన్య రుతు పవనాల రూపంలో చైన్నెకు ఏటా ఏదో ఒక గండం తప్పని సరి. కుండపోతగా వర్షం పడటం లేదా వాయుగుండం విలయతాండవం లేదా తుపాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది కూడా ఈశాన్య రుతు పవనాల రూపంలో సమస్య పొంచి ఉంది. గత అనుభవాల దృష్ట్యా, ఇప్పటికే చైన్నెలో వరద నీరు రోజుల తరబడి నిల్వ ఉండకుండా, ఆగమేఘాల మీద తరలించేందుకు వీలుగా వర్షపు నీటి కాలువల నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఎక్కడెక్కడ నీరు చేరుతాయో అక్కడంతా ముందస్తుగా మోటారు పంపు సెట్లను సిద్ధం చేసి ఉన్నారు. అలాగే నగరంలోని అన్ని సబ్ వేలు నిఘా వలయంలోకి తెచ్చి నీటి నిల్వ మీద దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టి ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను గురి పెట్టి ప్రత్యేక చర్యలు పూర్తి చేసి ఉండటమేకాకుండా 200 చోట్ల శిబిరాలను సైతం సిద్ధం చేసి ఉన్నారు.
21న అల్పపీడనం..
ఈ పరిస్థితులలో 21వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బయలుదేరనుంది. ఇది క్రమంగా బల పడి వాయుగుండంగా ఆ తదుపరి తుపాన్‌గా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ పరిశోధకలు పేర్కొంటున్నారు. ఈ తుపాన్ చైన్నెకు సమీపంలో లేదా ఆంధ రాష్ట్రం నెల్లూరుకు సమీపంలో తీరం దాట వచ్చని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట, వేలూరు జిల్లాపై అధిక ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే 27వ తేదీ వరకు ఉత్తర తమిళనాడును వర్షాలు ముంచెత్తే అవకాశాలతో అప్రమత్తంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధంమైంది. 22న అన్ని ఉత్తర తమిళనాడు జిల్లాల కలెక్టర్లతో సమావేశానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ముందస్తు ఏర్పాట్లు, ఆస్తి, ప్రాణనష్టం ఎదురుకాని రీతిలో చర్యలు విస్తృతం చేయనున్నారు. ఇదిలా ఉండగా అరేబియా సముద్రంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి రూపంలో కేరళ సరిహద్దులలోని తమిళనాడు జిల్లాలు కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని, తదితర పశ్చిమ కనుమల వెండి ఉన్న ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇక చైన్నె, శివారు జిల్లాలో ఆదివారం వాతావరణం మేఘావృతంగా ఉన్నప్పటికి, కొన్ని చోట్ల చిరుజల్లులు పలకరించాయి.