
తిరుత్తణి ఆలయంలో 22న స్కంధషష్టి
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో 22న లక్షార్చనతో స్కాందషష్టి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీపావళికి పండుగకు రెండు రోజుల తరువాత తిరుత్తణి ఆలయంలో స్కంధషష్టి వేడుకలు మంగళవారం షణ్ముఖర్‌కు లక్షార్చనతో ప్రారంభం కానున్నాయి. వేడుకలు సందర్భంగా మూలవర్లకు రోజూ విశేష అభిషేక పూజలు చేపట్టి బంగారు కవచం అలంకరిస్తారు. కావడి మండపంలో వేడుకలు సందర్భంగా ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు స్కంధషష్టి లక్షార్చన పూజలు నిర్వహిస్తారు. వేడుకల్లో ప్రధానమైన పుష్పాంజలి 27న సాయంత్రం చేపడుతారు. ఇందుకోసం దాదాపు 2 టన్నుల పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి స్వామికి పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు. 28న స్వామి కల్యాణోత్సవంతో స్కంధషష్టికి ముగింపు పలుకుతారు. స్కంధషష్టి సందర్భంగా భక్తులు మురుగన్ మాల ధరించి స్కంధషష్టి పఠనం చేపట్టి స్వామిని దర్శించుకోన్నారు. తిరుత్తణి ఆలయ ధర్మాపాలక మండలి చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి తదితరులు వేడుకల ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుచెందూర్‌లో..
తిరువొత్తియూరు: మురుగన్ ఆరుపడై వీడుల్లో 2వదైన తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏటా జరిగే వివిధ ఉత్సవాలలో ముఖ్యమైన కంద షష్టి ఉత్సవం ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున ఒంటి గంటకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. 1.30 గంటలకు విశ్వరూప దీపారాధన, 2 గంటలకు ఉదయ మార్తాండ అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు యాగపూజతో కంద షష్టి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు మూలవర్ కు ఉచ్చికాల అభిషేకం, దీపారాధన చేపడుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు యాగశాల దీపారాధన స్వామి జయంతినాథర్ 12.45 గంటలకు స్వామి జయంతినాథర్ వల్లి–దైవయా నైతో కలిసి బంగారు పల్లకిలో వేల్ వకుప్పు, వీరవాళ్ వకుప్పు అనే పాటలతో డప్పు వాయిద్యాలతో షణ్ముగ విలాస మండపానికి వస్తారు. అక్కడ స్వామికి మహా దీపారాధన జరుగుతుంది. సాయంత్రం 3.30 గంటలకు మూలవర్‌కు సాయరక్ష దీపారాధన చేపడుతారు. ఆ తర్వాత స్వామి జయంతినాథర్, వల్లి–దైవయానైతో కలిసి తిరువడుతురై అధీనం షష్టి మండపానికి వస్తారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు వివిధ అభిషేక వస్తువులతో అభిషేకం చేసి, అలంకరించి దీపారాధన చేస్తారు. అనంతరం స్వామి, అమ్మవారితో కలిసి బంగారు రథంపై గిరి వీధిలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు.27 వ తేదీన ముఖ్యఉత్సవం అయిన సూర సంహారం నిర్వహించనన్నట్లు ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు.