
సత్యభామలో మిషన్ మౌసమ్ సెంటర్
సాక్షి, చైన్నె : చైన్నె ఓఎంఆర్ సెమ్మంజేరిలోని సత్యభామ వర్సిటీలో మిషన్ మౌసమ్ పేరిట వాతావరణ పరిశోధన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఆకస్మిక మేఘావృతాలు, వాతావరణ మార్పులను గుర్తించేందుకు ఓ విద్యా సంస్థలో ఇదే తొలి కేంద్రం కావడం గమనార్హం. దీనిని సోమవారం కేంద్ర భౌగోళిక విజ్ఞానమంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ ప్రారంభించారు. ’మిషన్ మౌసమ్’ అర్బన్ ఎక్స్‌పెరిమెంట్ సెంటర్‌గా ఇది సేవలను అందించనుంది. భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ, పూణేలోని ఇండియన్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) మద్దతుతో స్థాపించబడిన ఈ కేంద్రం, దేశ వాతావరణ అభివృద్ధి, ‘వాతావరణ, వాతావరణ మార్పునకు సంబంధించిన పురోగతిలో ఒక ప్రధాన మైలురాయిగా ఉంటుందని ప్రకటించారు. ఢిల్లీ తర్వాత భారతదేశంలో రెండవ ’మిషన్ మౌసమ్’ పట్టణ ప్రయోగాత్మక కేంద్రాన్ని తమ వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని సత్య భామ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ డాక్టర్ మరియా జెనా జాన్సన్ వ్యాఖ్యానించారు. ఈ కేంద్రంలో చైన్నె వాతావరణం, పర్యావరణ వైవిధ్యాలను అధ్యయనం చేయడానికి సీలోమీటర్, సోడార్, మైక్రో రెయిన్ రాడార్ వంటి హైటెక్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ ఉపగ్రహాలు వాతావరణ ప్రసరణ, కాలుష్య కారకాలు, మేఘాలు మరియు వర్షపాత వైవిధ్యాలపై అధిక–నాణ్యత సమాచారాన్ని నిరంతరం సేకరిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీఎం – పూణే డైరెక్టర్ డాక్టర్ ఎ. సూర్యచంద్రరావు, డాక్టర్ తారా ప్రభాకరన్ (సైన్స్ – జి అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్, మిషన్ మౌసమ్, ఐఐటిఎం – పూణే), ప్రొఫెసర్ బాలాజీ రామకృ ష్ణన్ (డైరెక్టర్, ఎన్‌ఐఓటి), డాక్టర్ ఆర్.ఎస్. గంగారా (డైరెక్టర్, ఎన్‌సీసీఆర్), డా. పి.అముద (చైర్మెన్, ఐఎండి), డాక్టర్.పి.అముద (చైన్నె–ఆర్‌ఎంసి, చైర్మన్), ఉదయభాస్కర్ (సైన్స్ – ఎ, ఐఎన్‌సీఓఐఎస్, హైదరాబాద్) ప్రొఫెసర్ కురియన్(ప్రెసిడెంట్ – ఓషన్ సొసైటీ ఆఫ్ ఇండియా)లతో పాటుగా ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పరిశోధనకు..
ఈ కార్యక్రమంలో భాగంగా పురాతన వాతావరణ పరిశీలన కేంద్రం, సమాచార గ్యాలరీలు జియోక్రోనోస్, ఓషియానా ఇనోవేరియా కూడా ప్రారంభించారు. ఈ కేంద్రం మార్పులపై శాసీ్త్రయ పరిశోధనలను ఏకీకృతం చేస్తుంది. కొత్త సామర్థ్య నిర్మాణం, విద్యార్థుల శిక్షణ , అంతర్ విభాగ పరిశోధన అవకాశాలను సృష్టించనుంది. ఇది భారతదేశ వాతావరణ అంచనా సామర్థ్యాలను మెరుగుపరచడంలో, వాతావరణ మార్పునకు వ్యతిరేకంగా దేశ స్థితిస్థాపకతను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ప్రకటించారు. ఈసందర్భంగా ఐఐటీఎం పూణే , సత్యభామ విద్యా సంస్థ మధ్య వివిధ అవగాహన ఒప్పందాలు జరిగాయి. చివరగా విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, సత్యభామ విశ్వవిద్యాలయం , కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాతావరణ మార్పు పరిశోధన కోసం అత్యాధునిక సాంకేతిక కేంద్రం ప్రారంభించామన్నారు. మేఘాలలో మార్పులు, మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయి తదితర వాటిని అధ్యయనం చేయడానికి ఈ అత్యాధునిక కేంద్రం రూపొందించబడిందన్నారు. దీని ద్వారా, ఆకస్మిక వర్షం మేఘాల విస్ఫోటనాలను పర్యవేక్షించవచ్చని వివరించారు.