
కళాశాల జీవితంతోనే దిశా నిర్దేశం
తిరువళ్లూరు: పాఠశాల విద్య అనంతరం యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేది కళాశాల జీవితమేనని ఆర్‌ఎంకే విద్యాసంస్థల అధినేత ఆర్‌ఎస్ మునిరత్నం వ్యాఖ్యానించారు. ఆర్‌ఎంకే కళాశాలలో 37 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ విరామం తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుని, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కళాశాల జీవితంలో తాము ఎదుర్కొన్న మర్చిపోలేని సంఘటనలు, జ్ఞాపకాలను వారు నెమరవేసుకున్నారు. కష్టసుఖాలను పంచుకోవడానికి తరచూ ఆత్మీయ కలయిక పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వారు నిర్ణయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాసంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌ఎస్ మునిరత్నం హాజరై ప్రసంగించారు. కళాశాల పుట్టినిల్లులాంటిదన్న ఆయన, ఇక్కడికి పూర్వపు విద్యార్థులు ఎప్పుడైనా రావొచ్చన్నారు. కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఐఏఎ్‌స్, ఐపీఎస్, ఇన్‌కంటాక్స్ తదితర విభాగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. వారిని చూసినప్పుడల్లా వారి తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు, కళాశాల నిర్వాహకులే ఎక్కువగా సంతోషిస్తున్నట్టు తెలిపారు. 37 ఏళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసినా నేటి కాలంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్‌ఎంకే విద్యార్థులు అందిపుచ్చుకుని రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైస్‌చైర్మన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.