
వేలూరు జిల్లాలో కుండపోత వర్షం
పాలారులో వర్షపు నీటి ఉధృతి
కనసాల్‌పేటలో రాస్తారోకో
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాతనూరు డ్యామ్‌లో నీటి మట్టం పెరిగింది. దీంతో నీటి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో రోడ్లు, వీధులన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. వర్షపు నీరు వేలూరు నేతాజీ మార్కెట్‌లోకి చేరుకోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా వేలూరు గ్రీన్ సర్కిల్, కొత్త బస్టాండ్, బజారు వీధి పూర్తిగా వర్షపు నీటితో నిండి పోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలూరు పట్టణంలోని కన్‌సాల్‌పేటలో సుమారు 40 ఇళ్లలోకి వర్షపు నీటితో పాటు డ్రైనేజీ నీరు చేరడంతో అక్కడివారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం అందజేసినా ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఆ ప్రాంతవాసులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు, కార్పొరేషన్ అధికారులు అక్కడకు చేరుకొని స్థానికులతో చర్చలు జరిపి పంపారు. కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి, నీటిని విద్యుత్ మోటార్లు ద్వారా తీసే పనిలో నిమగ్నమయ్యారు. వేలూరు జిల్లా ఆంబూరు ప్రాంతంలో సంవత్సరాల తరబడి ఉన్న చింత చెట్టు నేల కొరగడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. వెంటనే చెట్టును నరికి తీసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. పేర్నంబట్టు, గుడియాత్తం ప్రాంతాల్లో విరివిగా వర్షాలు కురవడంతో పాలారులో నీరు పరుగులు తీసింది. వీటిని చూసేందుకు ప్రజలు ఆసక్తిగా తరలి వచ్చారు. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యా రు, ఆరణి, తిరువణ్ణామలై, పోలూరు, తండ్రాంబట్టు తదితర ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సందవాసల్, పడవేడు, పుష్పగిరి తదితర ప్రాంతాల్లోని అరటి తోటలు పూర్తిగా నేల మట్టం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

వేలూరు జిల్లాలో కుండపోత వర్షం