
బుల్లెట్ చిత్రం టీజర్ విడుదల
తమిళసినిమా: నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్, ఆయన సోదరుడు ఎల్వి న్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బుల్లెట్. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ పతాకంపై కదిరేశన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్నాసీ పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైశాలిరాజ్, సునీల్, అరవింద్ ఆకాశ్, వెంకట్, రంగరాజ్‌పాండియన్, ఆర్.సుందరరాజన్, శ్యామ్స్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి డిస్కోశాంతి శ్రీహరి కీలక పాత్రను పోషించడం విశేషం. 1980–90 ప్రాంతంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి క్రేజీ నటిగా రాణించిన ఈమె 1997 తరువాత తెరపై కనిపించలేదు. అలాంటిది సుమారు 28 ఏళ్ల తరువాత బుల్లెట్ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. కాగా సూపర్ నాచులర్ యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీభాషల్లో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. దీని తమిళం వెర్షన్‌ను విశాల్, ఎస్‌జే.సూర్య, పృద్వీరాజ్, జీవీ.ప్రకాశ్‌కుమార్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయగా, తెలుగు వెర్షన్‌ను నటుడు నాగచైతన్య విడుదల చేసినట్లు నిర్వాహకులు మీడియూకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ నిజానికి ఈ చిత్రాన్ని తాను తొలి చిత్రంగా చేయాలని భావించానని, అయి తే కొన్ని కారణాలతో అది కుదరలేదని చెప్పారు. దీంతో ఇప్పుడు ఇది తన రెండో చిత్రంగా తెరకెక్కుతోందని తెలిపారు. ఈ చిత్రానికి ఎంతగానో సహకరిస్తున్న నిర్మాత కదిరేశన్‌కు ధన్యవాదాలు అన్నారు. శ్యామ్ సీఎస్.సంగీతం, అరవింద్ సింగ్ చాయాగ్రహణం అందిస్తున్న బుల్లెట్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.