
ఘనంగా ఆడి శుక్రవారం పూజలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఆడిమాసం నాల్గవ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషే కాలు పుష్పాలంకరణలు నిర్వహించారు. వేలూరు హానికుల తమ్మన్ ఆలయంలో అమ్మవారికి ఉదయం మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని 49వ వార్డులోని అమ్మవారి ఆలయంలో 1,500 మంది మహిళలు పాలబిందెలతో మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. మధ్యాహ్నం అమ్మవారి ఆలయంలో మహిళా భక్తులు అన్నదానం చేశారు. అదేవిధంగా పల్లికొండ సమీపంలోని వెట్టువనం గ్రామంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాల చేసి పుష్పాలంకరణలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహించారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.