
విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలి
వేలూరు: విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇతరులకు సాయం చేసేవారుగా ఉండాలని విశ్వకర్మ జగద్గురు సీనందల్ 65వ మఠాధిపతి శివరాజ స్వామీజీ తెలిపారు. వేలూరు జిల్లా గుడియాత్తం శ్రీకాళికాంబల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రజతోత్సవ సంవత్సరం సందర్బంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, విద్యా స్కాలర్‌షిప్‌లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శివరాజ స్వామీజీ మాట్లాడుతూ నేటికి విద్యార్థులు పాఠశాల ఫీజులు చెల్లించలేక అనేక మంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, అటువంటి వారిని గుర్తించి వారికి విద్యా సాయం చేపట్టాలన్నారు. విద్యార్థులు పాఠశాల విద్యా సమయంలోనే వారి జీవితాలను నిర్ణయం చేసుకోవాలన్నారు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధించ వచ్చునన్నారు. ప్రస్తుతం కాళికాంబాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఆరు నుంచి ప్లస్‌టూ వరకు చదువుతున్న మొత్తం 750 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు విశ్వకర్మ స్నేహితుల సంక్షేమ సంఘం కార్యదర్శి, తమిళనాడు ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేనా జనార్దనన్, ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అరుణాచలం, తాము మనవర్ వృద్ధాశ్రమం చైర్మన్ డాక్టర్ ఆనంది తంగవేల్, కాళికాంబల్ ట్రస్ట్ నిర్వాహకులు లోకనాథాచారి, రాజేంద్రన్, జగన్నాథన్, కోశాధికారి వెంకటేశన్ తదితరులు పాల్గొన్నారు.