
అటవీ ప్రాంత యువకులకు ప్రత్యేక శిక్షణ
వేలూరు: అటవీ ప్రాంత యువకులు పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్పీ మయిల్‌వానం అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గాల్లోని పలు అటవీ గ్రామాలను నేరుగా సందర్శించి, ప్రజలను కలిసి మాట్లాడారు. పోలీసులు ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటేనే నేరాలు లేకుండా ఉంటాయన్నారు. దీంతోనే తాను అటవీ ప్రాంత ప్రజలను నేరుగా చూసేందుకు వచ్చానని ఇక్కడి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. అనంతరం అటవీ గ్రామాల్లో పదో తరగతి, ప్లస్‌టూ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉన్న యువకులు ఎంత మంది ఉన్నారు, పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు ఎంత మందికి ఆసక్తి ఉందనే వాటిపై త్వరలో సర్వేలు నిర్వహిస్తామన్నారు. వారికి ఆయా ప్రాంతాల్లోనే ఉచితంగా పోలీస్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొని ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగాల్లోకి రావాలన్నారు. అటవీ ప్రాంత ప్రజలు నాటు సారా కాచడానికి, విక్రయానికి వెళ్లకుండా ఉండాలన్నారు. అనంతరం అటవీ ప్రాంతాల్లోని ప్రజలను నేరుగా కలిసి వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.