
ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తే చర్యలు
● డీఐజీ ధర్మరాజన్
వేలూరు: ఇసుక అక్రమ రవాణాకు సహకరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని వేలూరు డీఐజీ ధర్మరాజన్ తెలిపారు. వేలూరు నూతన డీఐజీగా ఆయన సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేలూరు ఎస్పీ మయిల్‌వానం పుష్పగుచ్ఛం అందజేసి, స్వాగతం పలికారు. రాణిపేట, తిరువణ్ణామలై, తిరుపత్తూరు తదితర జిల్లాలకు చెందిన ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లు పుష్ప గుచ్ఛాలు అందజేసి, ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తంజావూరు, కన్యాకుమారి, కోవై తదితర ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. ప్రస్తుతం వేలూరు రీజినల్‌లోని నాలుగు జిల్లాల్లో సమస్యలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యంగా వేలూరు ఉమ్మడి జిల్లా పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో గుట్కా, మత్తు పదార్థాలు వేలూరు ఉమ్మడి జిల్లాకు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరు పట్టణంలో ట్రాపిక్ సమస్య అధికంగా ఉందని తమ దృష్టికి వచ్చిందని, వేలూరు ఎస్పీతో చర్చించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై గూడా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని ఇందుకు సాయం చేసే పోలీసులపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. తమ పరిధిలో ఉన్న వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లో రౌడీలు లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.