
క్లుప్తంగా
జీఆర్‌టీలో ఆడి ప్రత్యేక ఆఫర్లు
కొరుక్కుపేట: గత అరవై సంవత్సరాలుగా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన జీఆర్‌టీ జ్యువెలర్స్ ఆడి పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆ సంస్థ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ కస్టమర్లను ఆనంద పరిచే రీతిలో జీఆర్‌టీ జ్యువెలర్స్‌కు చెందిన ఏ జీఆర్‌టీ షోరూంలో చేసిన ప్రతీ కొనుగోలుతోనైనా కస్టమర్లకు వివిధ రకాల ప్రత్యేక బహుమతులను అందిస్తోందని తెలిపారు. చిన్నదాని నుంచి అతిపెద్ద కొనుగోలు వరకు ప్రతీ లావాదేవీలో కచ్చితంగా ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుందని పేర్కొన్నారు. గత 60 సంవత్సరాలు తమను ఆదరిస్తున్న కస్టమర్లకు ప్రతీ ఆడి సీజన్‌కు బహుమతి ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆడి ఆచారం క్యాంపెయిన్ అన్ని జీఆర్‌టీ జ్యువెలర్స్‌లో అందిస్తున్నట్టు మరో మేనేజింగ్ డైరెక్టర్ అనంత పద్మనాభన్ తెలియజేశారు.
దంపతులను కట్టేసి
నగలు, నగదు దోపిడీ
తిరువొత్తియూరు: సేలం సమీపంలోని వీరాణం కొమాలి ప్రాంతానికి చెందిన పూమాలై (51) రైతు. ఇతను ఆ ప్రాంతంలో ఇటుక బట్టీని నడుపుతున్నాడు. అతని ఇల్లు వీరాణంలో అరూర్ మెయిన్ రోడ్డులో ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఎప్పటిలాగే పూమాలై ఇంటి వరండాలో పడుకుని నిద్రపోయాడు. ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంకీ క్యాప్ ధరించిన నలుగురు వ్యక్తుల ముఠా అతని ఇంటికి చొరబడ్డారు. వరండాలో నిద్రిస్తున్న పూమాలైని తాడుతో కట్టేశారు. ఇంట్లోకి చొరబడిన ఆ ముఠా పూమాలై భార్య చిన్నపాపాని కూడా కట్టేసి, అరువకుండా ఆమె నోట్లో గుడ్డను కుక్కారు. తరువాత ఆమె ధరించిన 3 సవర్ల బంగారు చైన్, చెవులకు ధరించిన అర సవర కమ్మలను లాక్కున్నారు. అంతేకాకుండా బీరువాను తెరిచి అందులో ఉన్న 5 సవర్ల నగలు, రూ.30 వేలు నగదును దోపిడీ చేసుకుని అక్కడి నుంచి పారిపోయారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో
చెస్ పోటీలు
తిరుత్తణి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చెస్ పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి సోమవారం ప్రారంభించారు. తిరుత్తణి జోనల్ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు చెస్ పోటీలు తిరుత్తణిలోని ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. తిరుత్తణి, తిరువలంగాడు మండలాల్లోని 20 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన బాలికలు పాల్గొన్నారు. పోటీలను మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి ప్రారంభించారు. ఇందులో వంద మందికి పైగా బాలికలు పాల్గొని, చెస్‌లో తమ ప్రతిభ కనభరిచారు. జోనల్ స్థాయి పోటీల్లో గెలుపొందిన బాలికలు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం కలామణి, పీటీఏ అధ్యక్షుడు కుమరవేలు తదితరులు పాల్గొన్నారు.
సముద్ర గుర్రాల స్మగ్లర్ అరెస్ట్
అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని మరక్కనం ప్రాంతంలో సముద్ర గుర్రాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు దిండివనం అటవీ శాఖకు సోమవారం రహస్య సమాచారం అందింది. దీంతో అటవీ అధికారి భువనేష్ నేతృత్వంలోని అటవీ అధికారులు మరక్కణంలో నిఘా పెట్టారు. ఆ సమయంలో వారు పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన మోపెడ్‌ను నిలిపి, ఆ వ్యక్తి బ్యాగును తనిఖీ చేయగా, అందులో 14 చనిపోయిన సముద్ర గుర్రాలు ఉండడంతో అతడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు మరక్కణం ప్రాంతానికి చెందిన తమీమ్ అన్సారీ (47)తేలింది. అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆదాయ వృద్ధి లక్ష్యంగా
కొత్త పథకం
సాక్షి, చైన్నె: ఆదాయ వృద్ధిని పెంచుకోవడానికి యాక్టివ్ మొమెంటం ఫండ్ పథకాన్ని ప్రారంభించామని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఎండీ నీలేషా తెలిపారు. కేఎంఏఎంసీ యాక్టివ్ మొమెంటం ఫంఢ్ పథకం గురించి సోమవారం స్థానికంగా ప్రకటించారు. దీని గురించి వివరించారు. ఇది ఓపెన్ ఎండ్ ఈక్విటీ పథకంగా పేర్కొన్నారు. ఇది ఇన్ హౌస్‌యాజమాన్య నమూనాపై నిర్మించబడిన ఆదాయ వృద్ది అవకాశాలను సంగ్రహించడం లక్ష్యంగా తీర్చిదిద్దామన్నారు.ఈ పథకం కోసం పబ్లిక్ సబ్ స్క్రిప్షన్‌ను మంగళవారం(29వ తేది) నుంచి ఆగస్టు 12 వరకు ఆహ్వానించనున్నామని వివరించారు. కోటక్ యాక్టివ్ మొమెంటం ఫండ్ మేనేజర్ రోహిత్ టాండన్ మాట్లాడుతూ, ఆదాయాల ద్వారా నడిచే నిధిని సృష్టించడానికి, పెట్టుబడి వ్యూహాన్ని డేటా సైన్స్‌తో అనుసంధానించామన్నారు. ఈ కొత్త పథకం ఒక సాధారణ నమ్మకంపై నిర్మించబడిందని, ఆదాయాలు పెరిగినప్పుడు, అప్ గ్రేడ్‌లు అనుసరించినప్పుడు, ధరలు చివరికి సమలేఖనం అవుతాయని వివరించారు.