
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు
తిరుత్తణి: సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 23 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకుని హుండీల్లో కానుకలు చెల్లిస్తుంటారు. ఈక్రమంలో చివరి 23 రోజుల్లో భ్తుఉలు హుండీలో వేసిన కానుకలను ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయ వసంత మండపంలో లెక్కించారు. ఆలయ ట్రస్టుబోర్డు సభ్యురాలు ఉష సమక్షంలో ఆలయ సిబ్బంది వందమంది కానుకలను లెక్కించారు. భక్తులు హుండీల్లో రూ.కోటి 17 లక్షల 32 వేల నగదు, 649 గ్రాముల బంగారం, 14,007 గ్రాముల వెండి కానుకలుగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.