
క్లుప్తంగా
చెట్టును ఢీకొన్న కారు
● ఇద్దరు కార్మికులు దుర్మరణం
తిరువొత్తియూరు: చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. ఈఘటన కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుళిత్తలై సమీపంలోని కీరనూరు ప్రాంతానికి చెందిన ఏడుగురు వంట చెరకు నరికే పని కోసం మినీవ్యాన్‌న్‌లో కూడలూరుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని అర్ధరాత్రి తిరిగి ఇంటికి మినీవ్యాన్‌లో బయలుదేరారు. పి.ఉడయాపట్టి నుంచి కీరనూరు వెళ్లే రహదారిలో వెళుతుండగా, వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మినీవ్యాన్‌లోని కీరనూరు సమీపంలోని సామిపిళ్లై పుత్తూరుకు చెందిన వీరమలై (65), కాళపట్టికి చెందిన పళనియప్పన్ (65) మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోడ ప్రకటనలు
రాయడంలో ఘర్షణ
● విడుదలై చిరుత్తైగల్ పార్టీ
నేతలపై ఫిర్యాదు
తిరువొత్తియూరు: చైన్నె అన్నాసాలైలోని అన్నా అరివాలయం సమీపంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభల కోసం గోడ ప్రకటనలు రాశారు. అయితే విడుదలై చిరుత్తైగల్ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు, ఆ ప్రకటనలను నల్ల పెయింట్‌తో చెరిపివేసి తమ పార్టీ పేరును రాశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై విడుదలై చిరుత్తైగల్ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ చైన్నె తేనాంపేట పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బస్సులో అసభ్య ప్రవర్తన
● ఆయుర్వేద డాక్టర్‌కు దేహశుద్ది
తిరువళ్లూరు: మద్యం మత్తులో ఓ యువతి ఎదుట నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యశాల డాక్టర్‌ను బస్సులోని ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రాత్రి కలకలం రేపింది. తిరువళ్లూరు బస్టాండు నుంచి శ్రీపెరంబదూరుకు బుధవారం రాత్రి పది గంటలకు ప్రభుత్వ బస్సు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు కామరాజర్ విగ్రహం వద్ద వచ్చిన క్రమంలో అప్పటికే మద్యం మత్తులో వున్న వ్యక్తి నగ్నంగా మారి యువతి ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు నగ్నంగా ఉన్న వ్యక్తిని చూసి షాక్‌కు గురి కావడంతో పాటూ అతడ్ని చితకబాది దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు చేపట్టిన విచారణలో మద్యం మత్తులో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి శ్రీపెరంబదూరుకు చెందిన మదియగళన్‌గా గుర్తించారు. ఇతను అరక్కోణంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్‌గా పని చేస్తున్నట్టు నిర్ధారించారు. కాగా బస్సులో నగ్నంగా మారి యువత ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయుర్వేద వైద్యుడి వ్యవహార శైలి స్థానికంగా కలకలం రేపింది. కాగా నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల
పేరిట మోసం
● ముగ్గురి అరెస్టు
అన్నానగర్: మైలాడుతురై జిల్లా, సెంబనార్‌కోవిల్ కరువలక్కరైలోని కాళీయమ్మన్ కోయిల్ స్ట్రీట్‌కి చెందిన సురేష్ భార్య అనిత. ఈమెతో సహా 27 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మైలాడుదురై జిల్లా, తరంగంబాడి తాలూకా, తలైషంగాడు నెహ్రూ నగర్‌కు చెందిన గిరిజ (33), మోహన్ భార్య కల్పన (50), రమేష్ (44) మాయమాటలు చెప్పారు. అనితతో సహా 27 మంది నుంచి రూ.86.40 లక్షలు ఇచ్చారు. తర్వాత 27 మందికి నకిలీ ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చారు. దీని గురించి అనిత మైలాడుతురై డివిజనల్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేసినప్పుడు, రమేష్, గిరిజ, కల్పన డబ్బు తీసుకొని మోసం చేసుకున్నారని వెల్లడైంది. దీని ఆధారంగా, పోలీసులు మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. తర్వాత మైలాడుతురై కోర్టులో హాజరుపరిచి కడలూరు జైలుకు తరలించారు.
బ్రెయిన్ డెడ్ అయిన కాలేజీ
విద్యార్థిని అవయవాలు దానం
అన్నానగర్: అంబత్తూరులోని కల్లికుప్పంలోని ముత్తమిజ్ నగర్ నివాసి రఘుమూర్తి ఇతని కొడుకు హేమనాథ్ (18). నెర్ కుండ్రంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 21వ తేదీ మధ్యాహ్నం హేమనాథ్ తన స్నేహితుడిని పట్టరైవాక్కం రైల్వేస్టేషన్‌లో దింపి బైకుపై తిరిగి వస్తుండగా, కల్లికుప్పం సర్వీస్ రోడ్డు వద్ద ఓ లగేజ్ వ్యాన్ హేమనాథ్ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమైన హేమనాథ్‌ను స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో హేమనాథ్ తల్లిదండ్రులు కుమారుడి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ప్రకటించారు. దీని తర్వాత, ఆయన గుండె, మూత్రపిండాలు సహా ఆయన అవయవాలను దానం చేసి, త్వరలోనే వివిధ ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు మార్పిడి చేశారు. వైద్య సిబ్బంది నివాళులర్పించారు.