● ఆరు నెలల్లో ముమ్మరంగా చర్యలు ● నిబంధనలు పాటించని వారి నుంచి రూ.39 లక్షల జరిమానా వసూలు ● చైన్నె కార్పొరేషన్ ప్రకటన
తిరువొత్తియూరు: చైన్నె కార్పొరేషన్‌లో గత 6 నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల నిర్మాణ కూల్చివేత వ్యర్థాలు తొలగించారు. ఈమేరకు బుధవారం కార్పొరేషన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. గ్రేటర్ చైన్నె కార్పొరేషనన్‌లో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను తొలగించే పనులు తొండయార్‌పేట, రాయపురం, తిరు.వి.క. నగర్, అన్నా నగర్, తేనంపేట, కోడంబాక్కం, అడయార్, తిరువొత్తియూర్, మనలి, మాధవరం, అంబత్తూర్, వలసరవాక్కం, ఆలందూర్, పెరుంగుడి మరియు చోలింగనల్లూర్ అనే 15 జోన్‌లలో ముమ్మరంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల కోసం 15 జోన్‌లలో 168 వాహనాలను ఉపయోగించి రోజుకు సగటున 1000 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గత 6 నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగించినట్లు వెల్లడించారు. ఈ వ్యర్థాలను కొడుంగయ్యూర్, పెరుంగుడిలోని వ్యర్థాల విభజన కేంద్రాలకు తరలించి, వేరుచేసి రీసైక్లింగ్ కోసం ఉపయోగించుకుంటున్నారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల తొలగింపునకు సంబంధించి ప్రజల కోసం మార్గదర్శకాలు 21.04.2025 నుంచి గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించే చర్యలు కూడా చేపట్టామన్నారు. కాగా ఆ ప్రాంతాల్లో బాధు్‌ుల నిర్మాణ వ్యర్థాలు తొలగించకుండా ఉండటం పూర్తిగా నివారించామని పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలను పాటించని వారి నుంచి గత 6 నెలల్లో రూ.39.30 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపుకు సంబంధించిన మార్గదర్శకాలను గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ వెబ్‌సైట్, కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్ 1913 ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటనలో వెల్లడించారు.