
4 చోట్ల ఏసీ బస్ షెల్టర్లు
●రూ.8 కోట్లతో పనులు
సాక్షి, చైన్నె: గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో కొళత్తూరు, రాయపురం, పెరంబూరుతో సహా నాలుగు చోట్ల ఏసీ సౌకర్యంతో కూడిన బస్ షెల్టర్లను ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ పనులకు అంచనా వ్యయంగా రూ. 8 కోట్లు అవుతుందని నిర్ణయించారు. చైన్నె నగరంలోని వడపళణి, టీ నగర్, బ్రాడ్ వే, అంబత్తూరు, ఆవడి తదితర ప్రధాన ప్రాంతాలలోని ఎంటీసీ బస్టాండ్‌లను బహుళ అంతస్తుల తరహాలో మాల్స్‌తో కూడిన నిర్మాణాల దిశగా చైన్నె మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే, చైన్నె నగరంలోని ఎంటీసీ బస్టాపులను ఆధునీకరించే దిశగా అధికార యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. తొలి విడతగా మెరీనా తీరంలో మోడల్ బస్టాప్‌లపై దృష్టి పెట్టారు. అలాగే, ఆలందూరు వంటి మెట్రో జంక్షన్ల ప్రాంతాలలో ఏసీ సౌకర్యంతో ప్రయాణికుల కోసం బస్టాపులు ఏర్పాటు అయ్యాయి. దీనిని మరింత విస్తృతం చేసేదిశగా సీఎం స్టాలిన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొళత్తూరుతోపాటుగా రాయపురం, పెరంబూరుతో పాటూ సెంట్రల్‌రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఓ చోట ఏసీ సౌకర్యంతో కూడిన బస్టాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రయాణికుల కోసం ప్రత్యేక సీట్లు, ఏసీ సౌకర్యం, మహిళ కోసం మరుగు దొడ్డితో పాటుగా బస్సుల సమాచారాలను తెలియజేసే డిజిటల్ బోర్డు తదితర ఏర్పాట్లు చేపట్టనున్నారు.ఇందు కోసం అంచనా వ్యయంగా రూ. 8 కోట్లను నిర్ణయించారు.పెరంబూరులో 1265 చదరపు అడుగులలో, మిగిలిన చోట్ల 1754 చదరపు అడుగులలో ఈ బస్టాపులను ఏర్పాటు చేయనున్నారు.