
పరిశోధనలతో దేశాభివృద్ధి
వేలూరు: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి దోహద పడాలని ఇస్రో శాస్త్రవేత్త గాయత్రిదేవి పిలుపునిచ్చారు. వేలూరు అడుకంబరైలోని తందై పెరియార్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో 32, 33వ స్నాతకోత్సవం ప్రిన్సిపల్ పేకే పయణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్య అనేది డిగ్రీలు సాధించడంతో పూర్తి కావడం లేదని విద్య నేర్చుకోవడం అనేది మేధాశక్తిని పెంచుకోవడమే అన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు తరచూ ఇతర దేశాలకు ఉద్యోగాలకు వెళ్తున్నారే తప్పా మన దేశంలోనే పరిశోధనలు చేయడంపై ఆసక్తి చూపడం లేదన్నారు. అనంతరం ఎంటెక్, బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటూ ఉత్తమ మార్కులు సాధించిన వారికి బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపల్ పర్వీన్‌రాజ్, డిపార్ట్‌మెంట్ డీన్ కలైవాసన్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కళాశాలల ప్రత్యేక అధికారి పార్థిబన్, విద్యార్థులు పాల్గొన్నారు.