
ఉద్యోగం ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం
తిరువళ్లూరు: ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్న తరువాత కూడా ఉద్యోగం ఇవ్వకుండా మొండి చేయి చూపుతున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి శ్రీనివాసపురం ముస్లింనగర్ ప్రాంతానికి చెందిన రసూల్(32)కు వివాహమై భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం మార్చిలో హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో రసూల్ పోటీ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం ఇతడికి గత మార్చి 17 ఇంటర్వ్యూ నిర్వహించగా అందులో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలో ఉద్యోగానికి ఎంపికై నట్టు గత ఏప్రిల్ 21న ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇంత వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే పలుసార్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరారు. అయితే న్యాయం జరగకపోగా ఇటీవల రసూల్ ఇంటర్వ్యూకే హాజరు కాలేదని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన భాదితుడు రసూల్ తన భార్య జైనాబ్(26) ముగ్గురు ఆడపిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని వారించి అడ్డుకుని కలెక్టర్ ప్రతాప్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్ వద్ద తన జరిగిన అన్యాయాన్ని వివరించడంతో ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వులను చూపించాడు. బాధితుడి సమస్యలను విన్న కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అతడు వెనుదిరిగాడు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జనం రద్దీగా ఉన్న సమయంలో హఠాత్తుగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని వ్యక్తి గట్టిగా అరుస్తూ ఆత్మాహుతికి యత్నించిన సంఘటన కలెక్టర్ కార్యాలయంలో కలకలం సృష్టించింది.