
తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి చర్యలు
సాక్షి, చైన్నె: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తాత్కాలిక లెక్చరర్ల నియామకానికి ఉన్నత విద్యా శాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు చైన్నెలోని క్వీన్ మేరీ కళాశాలలో ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ కేవీ చెలియన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. ప్రాథమిక ప్రాతిపదికన 574 గౌరవ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తు నమోదు వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు 2025–26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల అడ్మిషన్లు ముగిసి, తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందరికీ ఉన్నత విద్య లక్ష్యంగా ఈ ఏడాది 15 కొత్త ప్రభుత్వ కశాలలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యను పరిగణించి సీట్ల పెంపునకు సైతం ఆయా కళాశాలలకు ఆదేశాలిచ్చారు. ఈ పరిస్థితులలో విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యా బోధనలు జరిగే విధంగా 574 మంది గౌరవ లెక్చరర్లను తాత్కాలికంగా నియమించేందుకు ప్రస్తుతం చర్యలు తీసుకున్నారు. ఇందు కోసం www.tnfara.orf వెబ్ సైట్‌ను రూపొందించారు. 34 కోర్సులకు సంబంధించి 574 మంది నియామకానికి సంబంధించిన సమగ్ర వివరాలు, ఎంపికకు అర్హత వివరాలను పొందు పరిచారు. ఆగస్టు 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి, విద్యా అర్హత, ఇంటర్వ్యూ మూల్యాంకనాల ఆధారంగా అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.సుందరవళ్లి తదితర అధికారులు హాజరయ్యారు.