
రజనీ మాటలను ఆహ్వానిస్తున్నాం !
వేలూరు: పార్టీకి సీనియర్లు ఎంతో ముఖ్యమని నటుడు రజనీకాంత్ చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర సీనియర్ మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలో మీతో స్టాలిన్ పథకాన్ని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రసంగించారు. డీఎంకే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన సమయంలో పలువురు హేళన చేశారన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం మీతో స్టాలిన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీటిలో ఎటువంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరిస్తామని సమస్యత్మాక వినతులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సేలంలో కరుణానిధి విగ్రహంపై నల్లటి కాటుక పూశారని ఇది పద్ధతి కాదన్నారు. ఒక రాజకీయ పార్టీకి, ఒక ఆర్గనైజింగ్‌కు సీనియర్లు ఎంతో ముఖ్యమని రజనీ చెప్పడం అభినందనీయమన్నారు. దీంతో తాను రజనీకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపానన్నారు. అనంతరం పొన్నై, గుడియాత్తం ప్రాంతాల్లో మీతో స్టాలిన్ పథకాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, కార్పొరేషన్ జోన్ చైర్‌పర్సన్ పుష్పలత, కార్పొరేటర్ అన్బు, లోకనాథన్, రవికుమార్, టీటా శరవణన్ పాల్గొన్నారు.