
మహా కుంభాభిషేకం
తిరుప్పరకుండ్రంలో నేడు
తిరుప్పరకుండ్రంలో ఏర్పాటు.. (ఇన్‌సెట్) మీనాక్షి, సుందరేశ్వరులు
● తరలి వస్తున్న భక్తులు
సాక్షి,చైన్నె: తిరుప్పరకుండ్రంలో మహాకుంభాభిషేక వేడుకకు సర్వం సిద్ధం చేశారు. ఇక్కడి వేడుక కోసం మదురై నుంచి మీనాక్షి అమ్మన్ మరియు సుందరేశ్వరర్ స్వామి వారు తిరుప్పరకుండ్రంకు బయలు దేరి వెళ్లారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో నిఘా కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో మురుగన్‌కు ఉన్న ఆరుపడై వీడులలో మొదటిదిగా తిరుప్పరకుండ్రంప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే. మదురై జిల్లా తిరుప్పరకుండ్రం కొండపై సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో గత కొన్నేళ్ల అనంతరం మహాకుంభాభిషేకానికి హిందూ, దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. రాజగోపురంను పంచవర్ణాలతో తీర్చిదిద్దారు.జీర్ణోద్దారణ పనులు ముగియడంతో ఈనెల పదో తేది నుంచి ఇక్కడ కుంభాభిషేకానికి సంబంధించినయాగ శాల పూజలు జరుగుతూ వచ్చాయి. ఆలయం ఆవరణలో వళ్లి దేవానై మండపం ఆవరణలో యాగ శాల పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక యాగాలు, పూజలు జరిగాయి. సోమవారం వేకువ జామున మూడున్నర గంటల నుంచి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 4.30 గంటలకు యాగశాల నుండి పవిత్ర జలాలను కలశాలలోఉంచి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. ఉదయం 5.25 గంటలకు రాజగోపురంలోని 7 కలసాలకు పవిత్ర అభిషేకాలు జరగనున్నాయి. అలాగే, ఆలయ ప్రాంగణంలోని గోవర్ధన ఆలయంలో, విమాన ప్రకారంలకు అభిషేకాలు నిర్వహించనున్నారు.సరిగ్గా 6.10 గంటలకు మురుగన్ సన్నిధిలో మహాకుంభాభిషేకం జరగనున్నది. ఈ వేడుక నిమ్తితం తమిళనాడులోని మురుగన్ భక్తులు ఆదివార ం మధ్యాహ్నం నుంచే తిరుప్పర కుండ్రం వైపుగా పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది.
మీనాక్షి, సుందరేశ్వరుల పయనం
మదురైలోని తిరుప్పరంకుండ్రంలో జరగనున్న కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకుని మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర్ స్వామి ఆదివారం తమ ఆలయం నుంచి తిరుప్పరకుండ్రంకు బయలు దేరి వెళ్లారు. మదురై ఆలయంలో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి పది గంటలకు స్వామి, అమ్మవారులు తిరుప్పరకుండ్రంకు బయలు దేరగా దారి పొడవున భక్తులు కర్పూర నీరజనాలు పలికారు. తిరుపరంకుండ్రంకు అర్ధరాత్రి చేరుకుని కుంభాభిషేకం అనంతరం మదురై ఆలయానికి స్వామి,అమ్మవార్లు తిరిగి వచ్చేందుకు సమయం పట్టనున్న దృష్ట్యా, సోమవారం మీనాక్షి అమ్మన్ ఆలయంలో భక్తులకు దర్శనంరద్దు చేశారు. తిరుప్పర కుండ్రంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.