
ఘనంగా ఐఐటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసు 62వ స్నాతకోత్సవం శుక్రవారం చైన్నె క్యాంపస్‌లో ఘనంగా జరిగింది. 3,227 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఇండియన్ నాలెడ్జ్ సెంటర్‌ను ఈసందర్భంగా ప్రారంభించారు. జాతీయ విలువ కలిగిన అత్యున్నత సంస్థగా ఐఐటీ మద్రాసును భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అభివర్ణించారు. ఐఐటీ మద్రాసు ఆవరణలో ఉదయం జరిగిన స్నాతకోత్సవంలో 3,661 విద్యార్థులకు డిగ్రీలు (జాయింట్, డ్యూయల్ డిగ్రీలు సహా) ప్రదానం చేశారు. మొత్తం 529 మందికి పీహెచ్‌డీలు కూడా ప్రదానం చేశారు. కార్యక్రమానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత భరతనాట్య నృత్యకారిణి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఐఐటీ మద్రాస్ గవర్నర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ పవన్ గొయాంకా స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.
జాతీయ విలువ కలిగిన సంస్థ
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులను , వివిధ బహుమతి విజేతలను అందుకున్న వారిని అభినందిస్తూ, అజిత్ దోవల్ మాట్లాడుతూ, జాతీయ విలువ కలిగిన మార్గదర్శక సంస్థ ఐఐటీ మద్రాసు అని అభివర్ణించారు. ఇక్కడ ఉండటం ఒక గౌరవంగా పేర్కొన్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ గురించి ప్రస్తావిస్తూ, విదేశాలలో వ్యక్తిగత సౌకర్యాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకండి, నిజమైన విజయం నివసించే చోట కాదు, అందించే దానిలో ఉంటుంది.్ఙ అని అజిత్ దోవల్ పిలుపు నిచ్చారు. ప్రశంసల కోసం మాత్రమే కాకుండా, ప్రభావం కోసం ఆవిష్కరణలు చేయండి అని పిలుపునిచ్చారు.అలాగే, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ భారత సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టాయని వివరించారు. అయితే, కొన్ని అంతర్జాతీయ మీడియా తప్పుడు సమాచారాన్ని బయటకు ప్రచారంచేసినట్టు అసహనం వ్యక్తం చేశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మట్లాడుతూ 3,227 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలను ప్రదానం చేశామన్నారు. ఈసందర్భంగా తమ పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంబంధాలు, సంస్థాగత అభివృద్ధి ద్వారా 2024–25లో రూ. 320 కోట్లు సేకరించామన్నారు. ఐఐటీ మద్రాస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయాంకా మాట్లాడుతూ, 100 సంవత్సరాల స్వాతంత్య్రం జరుపుకునే సమయానికి ప్రధానమంత్రి వీక్షిత్ భారత్ఙ్ మేరకు పూర్తిగా అభివృద్ధి చెందిన భారతదేశం చూడవచ్చు అని వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐఐటీ తన ఉత్సవాల ద్వారా ప్రదర్శనలలో కళలకు ఎల్లప్పుడూ ప్రాముఖ్యతను ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవం
ఐఐటీ మద్రాస్‌లో సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేఎస్) కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కేంద్రం ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన కేంద్రంగా పనిచేస్తుంది, విభిన్న విభాగాల నుంచి అధ్యాపకులను ఒకచోట చేర్చుతుంది. దీని పరిశోధన విస్తృత శ్రేణి నేపథ్య రంగాలను కలిగి ఉంటుంది. అలాగే, కృష్ణ చివుకుల బ్లాక్‌లో ఐకేఎస్ కారిడార్‌ను అజిత్ దోవల్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ గురుమూర్తి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్, హెచ్‌ఎస్‌ఎస్ విభాగం ఐకేఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దీపక్ పరమశివన్ పాల్గొన్నారు. బీఎస్ అనిరుద్‌కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైజ్, భారతరత్న ఎం విశ్వేశ్వరయ్య మెమోరియల్ ప్రైజ్, అనిత్ ఆనంద పొహెలికి ఇనిస్టిట్యూట్ మెరిట్ ప్రైజ్, వీఆర్ అభినవ్‌కు డాక్టర్ శంకర్ దయాల్‌శర్మ ప్రైజ్, రాజ గోపాల సుబ్రమణియంకు గవర్నర్ ప్రైజ్‌ను బహుమతిగా అందజేశారు.
3,227 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం
ఇండియన్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు
జాతీయ విలువ కలిగిన సంస్థగా అజిత్ దోవల్ అభివర్ణన

ఘనంగా ఐఐటీ స్నాతకోత్సవం

ఘనంగా ఐఐటీ స్నాతకోత్సవం