
జైలు నుంచి విడుదలైన నటులు శ్రీరామ్, కృష్ణ
తమిళసినిమా: కోలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వ్యవహారంలో కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల వాడిని కేసులో నటుడు శ్రీరామ్ (తమిళంలో శ్రీకాంత్) ను పోలీసులు గత నెల 23వ తేదీన అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించిన విషయం, అదే కేసులో మరో నటుడు కృష్ణ ను గత నెల 26వ తేదీన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణలో తమ తప్పును అంగీకరించిన ఈ నటులు బెయిల్ కోసం చైన్నె మాదక ద్రవ్యాల నిరోధక విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కోర్టు వీరి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో శ్రీరామ్, కృష్ణ తరుపు న్యాయవాదులు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం శ్రీరామ్, కృష్ణకు రెండు రోజుల క్రితం నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రతులను న్యాయవాదులు జైలు అధికారులకు అందించారు. అనంతరం ప్రొసీజర్స్ పూర్తి చేసిన జైలు అధికారులు బుధవారం రాత్రి నటులు శ్రీరామ్, కృష్ణను విడుదల చేశారు.
రాష్ట్రంలో ఉరుములు,
మెరుపులతో కూడిన వర్షాలు
కొరుక్కుపేట: తమిళనాడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వేడిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు గురువారం తెలిపారు. ఇప్పటికే ఉత్తర భారత ప్రాంతాలపై ఉన్న అల్పపీడన ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలపై కొత్తగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతాల్లో పవనాలు పశ్చిమ దిశగా కదులుతున్నాయి. ఈక్రమంలో గాలులు పాకిస్తాన్ నుంచి మహారాష్ట్రకు వర్షాలు తాకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశాలలో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక తమిళనాడు వాతావరణం గుండా పసిఫిక్ మహాసముద్రం వైపు చైనా వైపు గాలులు వీస్తున్నట్టు వెల్లడించారు. దీని కారణంగా చైనాలో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు ఉత్తర తీరం వెంబడి వర్షం పడుతుంది. ఏర్కాడ్, కల్వరాయణమాలయ, కొడైకెనాల్ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఇక 12వ తేదీన తిరువళ్లూరు, చైన్నె, కాంచీపురం జిల్లాల్లో వర్షం కురుస్తుందని చైన్నె వాతావరణ శాఖ ప్రకటించింది.
వృద్ధురాలి హత్య
నగలు చోరీ
తిరువొత్తియూరు: వృద్ధురాలిని దారుణంగా హతమార్చి దుండగలు నగలు చోరీ చేసిన ఘటన కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కడలూరు జిల్లా బువనగిరి సమీపంలోని చెట్టికుళం ప్రాంతంలోని నాథమేడుకు చెందిన వేలు. ఇతని భార్య చంద్ర (60). ఈమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటి వెనుక తలుపు పగులగొట్టి లోపలికి చొరబడి చంద్ర ముఖంపై దిండుతో నొక్కడంతో ఊపిరాడక మృతిచెందింది. వృద్ధురాలి మెడలోని చైన్, గాజులు దోచుకుని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన నాగరాజన్ కుమారుడు పశుపతి (27) వృద్ధురాలిని హత్య చేసి నగలు దొంగిలించాడని తేలింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 76,501 మంది స్వామి వారిని దర్శించుకోగా 29,033 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్‌లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.