
ధనుష్ 54వ చిత్రం ప్రారంభం
తమిళసినిమా: నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన కధానాయకుడిగా నటించిన కుబేర చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా హిందీలో నటిస్తున్న చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్‌కు జంటగా మాలీవుడ్ బ్యూటీ మమిత బైజు నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది అన్నది గమనార్హం. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, తేనీ ఈశ్వర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, జయరాం, సురాజ్ వెంజరముడు, పృథ్వీ పాండియ రాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను మనదేశంలోని పలు ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం నటుడు ధనుష్ కెరీర్‌లో మరో భారీ చిత్రంగా ఇది ఉంటుందని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.