
మార్షల్‌గా కార్తీ
తమిళసినిమా: స్టార్ హీరోల్లో నటుడు కార్తీ ఒకరు. ఈయన వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. కార్తీ ఇటీవల నటించిన మెయ్యళగన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్దియార్ చిత్రంతో పాటు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్–2 చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో వా వాద్దియార్ చిత్రం ముందుగా విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా కార్తీ మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 29వ చిత్రం అవుతుంది. ఈ చిత్రాన్ని ఐవీవై ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థతో కలిసి వారియర్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్ ఆర్.ప్రభు, ఎస్‌ఆర్ ప్రకాష్ నిర్మిస్తున్నారు. టాణాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దీనికి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తునున్నారు. ఈ చిత్రానికి మార్షల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం గురువారం చైన్నెలోని ప్రసాద్ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటి కల్యాణి ప్రియదర్శన్ కథానాయకిగా నటిస్తుండగా, సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కన్, ఈశ్వరీరావు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రంలో కార్తీ నటించే అవకాశం ఉంది. దీనికి సాయి అభయంకర్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం తెలిపింది.