
ఇకపై ప్రమాదానికి ఆస్కారం ఇవ్వొద్దు!
– బాణసంచాల ప్రమాదంపై ట్రిబ్యునల్
సాక్షి, చైన్నె: విరుదునగర్‌లో జిల్లాలో ఇకపై ఒక్క బాణసంచా ప్రమాదానికి ఆస్కారం ఇవ్వొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులను హెచ్చరించింది. విరుదునగర్ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాలు బాణసంచాల తయారీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రజలకు బాణసంచా పరిశ్రమల్లో కూలీ పనులే దిక్కు. అదే సమయంలో నిత్యం ఇక్కడ ప్రమాదాలు సైతం తప్పడం లేదు. ఈ ఆరు నెలల్లో పదికి పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రమాదాలపై దక్షిణ భారత గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. చైన్నెలోని ట్రిబ్యునల్ బుధవారం విరుదునగర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఒక్కటంటే ఒక్క ప్రమాదం జరగడానికి వీలు లేదని హెచ్చరించింది. పది రోజుల్లో ఇక్కడున్న అన్ని పరిశ్రమల్లో కలెక్టర్ నేతృత్వంలో ఒక బృందం, పేలుడు పదార్థాల క్రమబద్ధీకరణ విభాగం అధికారులతో కూడిన మరో బృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఇక్కడ కార్మికులకు ఉన్న భద్రత, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చేపట్టిన చర్యలను సమగ్రంగా పరిశీలించి నివేదికలను సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.