
ఉన్నత విద్య కోసం కోస్టుగార్డు ఒప్పందం
సాక్షి, చైన్నె : కోస్టు గార్డు కుటుంబాలకు చెందిన వారికి విద్యా అవకాశాలు, సంక్షేమానికి మద్దతు ఇచ్చే విధంగా ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ, సీజీడబ్ల్యూడబ్ల్యూఏ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. కాటన్ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంక్షేమ సంస్థ అయిన కోస్ట్ గార్డ్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్(సీజీడబ్ల్యూడబ్ల్యూఏ) మధ్య జరిగిన సమావేశానంతరం ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ వివరాలను బుధవారం ప్రకటించారు. చైన్నెలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (తూర్పు)లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంపై ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. పొన్నుసామి, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్ హెచ్ క్యూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డిఐజి అనురాగ్ కౌశిక్, సీజీడబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు ప్రియా పరమేష్ అధికారికంగా సంతకం చేశారు. ఎస్‌ఆర్‌ఎం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సి. ముత్తమిళ్చెల్వన్ ఈసందర్భంగా మాట్లాడుతూ, తమ సంస్థలో బహుళ విభాగం విద్య, పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇందులో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్, సీజీడబ్ల్యూడబ్ల్యూఏ సహకారంతో దేశానికి సేవ చేసే వారి కుటుంబాలకు నాణ్యమైన విద్యా అవకాశాలను అందించడం ద్వారా సామాజిక బాధ్యత తమ అంకితభావాన్ని చాటుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ ఒప్పందం సేవలందిస్తున్న, పదవీ విరమణ చేసిన కోస్ట్ గార్డ్ సిబ్బంది పిల్లలు, జీవిత భాగస్వాముల ఉన్నత విద్యకు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే మరణించిన లేదా వైకల్యంతో జీవిస్తున్న కోస్టు గార్డు సిబ్బంది కుటుంబాలకు కూడా ఒప్పందం వర్తిస్తుందన్నారు. అవగాహన ఒప్పందం నిబంధనల ప్రకారం తమ క్యాంపస్‌లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ , డాక్టోరల్ ప్రోగ్రామ్‌లలో ట్యూషన్ ఫీజు రాయితీలతో పాటూ రిజర్వుడ్ సీట్లు అందిస్తామన్నారు.