
యువకుడి అరెస్టు
తిరువళ్లూరు: కత్తి చూపించి చైన్ స్నాచింగ్‌కు పాల్పడడంతోపాటు ఆటో, ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 19 సవర్ల బంగారు నగలు, ఆటో, ద్విచక్ర వాహనంతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలోని విజయలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భగవాన్‌దాస్(64) తన ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని యువకుడు కత్తి చూపి, అతడి మెడలోని బంగారు గొలుసును లాక్కుకుని పరారయ్యాడు. అలాగే అంబత్తూరు సమీపంలోని పుదూరు గ్రామానికి చెందిన రాజ(52) తన ఇంటి ముందు ఆపి ఉన్న ఆటో సైతం చోరికి గురైంది. దీంతో పాటు విజయలక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేషన్(46) అనే వ్యక్తి వద్ద రూ.12 వేలు అపహరించారు. మూడు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ పుటేజీల ఆధారంగా అంబత్తూరు కల్లికుప్పం గ్రామానికి కృష్ణన్ కుమారుడు అజిత్(27)ఈ చోరీలకు పాల్పడినట్టు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి, ఆటో, ద్విచక్ర వాహనం, బంగారునగలను స్వాధీనం చేసుకున్నారు.