
మహా కుంభాభిషేకానికి పోటెత్తిన జనం
పళ్ళిపట్టు: నాదాదీశ్వరర్ ఆలయంలో సోమవారం నిర్వహించిన మహాకుంభాభిషేకం వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి అనుసంధానంగా ఉన్న పళ్లిపట్టు సమీపం కరింబేడు నాదాదీశ్వరర్ ఆలయం వెయ్యేళ్ల చరిత్ర కలిగిఉంది. స్వామి స్వయంభుగా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఈ ఆలయ మహాకుంభాభిషేకం నిర్వహించి 13 సంవత్సరాలు పూర్తి కావడంతో తిరుత్తణి ఆలయం నిర్వాహకులు, కరింబేడు గ్రామీణులు సంయుక్తంగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేపట్టి ఆలయ గోపురాలకు జీర్ణోద్ధరణ పనులు చేపట్టి అందంగా ముస్తాబు చేశారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు నిర్వహించిన మహాకుంభాభిషేకం వేడుకలు సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాలు విద్యుద్దీపాలతో అలంకరించి హోమగుండ పూజలు జరిగాయి. సోమవారం ఉదయం తిరుత్తణి ఆలయ అర్చకుల బృందం ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి హోమం అనంతరం మేళతాళాల నడుమ పవిత్ర పుణ్యతీర్థాల కలశాలు బయల్దేరి ఊరేగింపుగా రాజగోపురం, విమాన గోపురం సహా ఇతర గోపురాలకు పుణ్య తీర్థాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి, పళ్లిపట్టు, నగరి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభాభిషేక వేడుకల్లో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, పళ్లిపట్టు నార్త్ మండల కార్యదర్శి సీజే శ్రీనివాసన్, తిరుత్తణి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సురేష్‌బాబు, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి సెంథిల్‌కుమార్, జానకిరామన్, అయ్యప్పన్, కుమార్, మాధవన్ సహా అనేక మంది పాల్గొన్నారు.
తొక్కిసలాటలో భక్తుల ఇక్కట్లు
మహాకుంభాభిషేకం వేడుకల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. పోలీసులు గవర్నర్ తిరుమల నుంచి తిరుత్తణి మార్గంలో సోమవారం ఉదయం చైన్నెకు పయనం కావడంతో భద్రత కోసం డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లిపోగా కుంభాభిషేకంలో భద్రత ఏర్పాట్లకు పోలీసులు లేక పోవడంతో ఒక్కసారిగా ఆలయ ప్రవేశమార్గం వద్ద చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, జాయింట్ కమిషనర్ సహా మహిళలు, చిన్నారులు, వృద్ధులు చిక్కుకోవడంతో అర్ధగంట పాటు ఇబ్బందులు తలెత్తాయి. ఆలయ సిబ్బంది పరిస్థితులు చక్కదిద్దారు. దీంతో పరిస్థితులు చక్కబడ్డాయి.

మహా కుంభాభిషేకానికి పోటెత్తిన జనం