– హాజరైన కంచీ మఠం పీఠాధిపతులు
తిరువళ్లూరు: ఆరణి, తండలం తదితర రెండు గ్రామాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరిగిన అష్టబంధన మహా కుంభాబిషేకం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ తండలం గ్రామంలో ధరణీశ్వరుడి ఆలయం ఉంది. ఆలయంలో మహాకుంభాభిషేకం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా చేపట్టారు. మహాకుంభాభిషేకం సందర్భంగా గత రెండున గణపతి హోమం, గోపూజ, వాస్తుశాంతి, నవగ్రహ పూజ, మహాలక్ష్మీ పూజను నిర్వహించారు. అనంతరం సోమవారం ఉదయం పది గంటలకు విమానగోపురం, మూలస్థానం పరివారమూర్తి తదితర ఉత్సవ మూర్తులకు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీసత్య చంద్రశేఖర సరస్వతి తదితరులు గోపుర కలశంపై పుణ్యజలాలను వదిలి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు పాలు పెరుగు, పన్నీరు, చందనం తదితర వాటితో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలవర్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదే విధంగా తిరువళ్లూరు జిల్లా ఆరణిలో శ్రీకంచి కామకోటి పీఠం శంకర మఠం ఆలయంలో శ్రీఆదిశంకరుడికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. అంతకు ముందు గణపతి హోమం, మహాలక్ష్మీపూజ, గోపూజతోపాటు ఇతర పూజలను నిర్వహించారు. అనంతరం ఏడు గంటలకు ఆదిశంకరుడు సహా పలు మూలవర్లకు మహాకుంభాభిషేకం నిర్వహించారు.
వైభవంగా ఆలయ కుంభాభిషేకం