
మొక్కలతోనే మానవ మనుగడ
రామచంద్రాపురం : మానవాళి జీవన గమనానికి మొక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మండల పరిధిలో కుప్పంబాదురు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ –2025 కార్యక్రమాన్ని ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కై లాస్ గురూజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆశ్రమం వద్దకు చేరుకున్న ఆయనకు నిర్వాహుకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆశ్రమంలో మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణాయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉందని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందు కొచ్చిన ప్రాణ యోగ ఆశ్రమ పీఠాధిపతి కై లాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రాణ యోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్‌ఎస్ అధికారిణి పాయల్ గుప్తా, డాక్టర్ సత్యనారాయణరాజు, ఎంపీడీఓ ఇందిరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ అన్వర్ భాష, ఏపీవో సుజాత, వ్యవసాయ శాఖ అధికారిణి మమత తదితరులు పాల్గొన్నారు.