
శ్మశాన దారి ఆక్రమణపై ధర్నా
వేలూరు: శ్మశాన దారి ఆక్రమణను తొలగించాలని కోరుతూ గ్రామస్తులు వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, నినాదాలు చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన ప్రజా విన్నపాల దినోత్సవం నిర్వహించారు. దీంతో వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఇదిలా ఉండగా ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా కాట్పాడి తాలూకా ఏరంతాంగల్ గ్రామానికి చెందిన మహిళలు వినతీ పత్రాలతో వచ్చి ధర్నా నిర్వహించారు. మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలోని శ్మశానాన్ని అఽధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించుకొని ఉన్నారని, వీటిపై గ్రామస్తులు పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వీటిపై విచారణ జరిపి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా అనకట్టు తాలూకా కీల్‌క్రిష్ణాపురం గ్రామానికి చెందిన ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులో తమ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 10 మంది విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థులు లేని కారణం చూపి అధికారులు టీచర్‌లను నియమించలేదన్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా విద్యా బోధన చేసే వారు లేరన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో పాఠశాలను మూసి వేసే పరిస్థితి ఉంటుందని వెంటనే పాఠశాలకు టీచర్‌ను నియమించాలని కోరారు. వినతులను స్వీకరించిన అధికారులు వివిధ శాఖల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు.