
ఇక, సామాజిక న్యాయ హాస్టళ్లు
సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా వివిధ విభాగాల పరిధిలోని సంక్షేమ హాస్టళ్ల పేర్లన్నీ ఒకే గూటికి చేరాయి. ఈ హాస్టళ్లను సామాజిక న్యాయ హాస్టళ్లుగా పిలిచే విధంగా సీఎం స్టాలిన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. రాష్ట్రంలో కులం పేరుతో, మతం పేరుతో , వివిధ సామాజిక వర్గాల పేర్లతో సంక్షేమ హాస్టళ్లు విద్యార్థుల కోసం ఏర్పాటై ఉన్న విషయం తెలిసిందే. కుల ,మత భేదాలను, అసమానతలను పూర్తిగా తొలగించే ప్రయత్నంలో అందరికీ అన్నీ నినాదంతో పరుగులు తీస్తున్న సీఎం స్టాలిన్ ఈ హాస్టళ్ల విషయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా చేసిన ప్రకటన మేరకు ఇక, మీదట కాలనీలను అన్న పదం వాడకుండా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రోడ్లు, ప్రాంతాలకు కులం, మతం పేర్లను తొలగించి అందమైన తమిళ పేర్లు, పండ్లు,పుష్సాల పేర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే,ప్రభుత్వ బడులలోనూ కులం, మతం, సామాజిక వర్గాల పేర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.ఈ పరిస్థితులలో.. ఆది ద్రావిడ, గిరిజన తదితర పేర్లతో, వివిధ సామాజికవ ర్గాల పేర్లతో ఉన్న అన్ని హాస్టళ్ల పేర్లనుమార్చే విధంగా సూచించారు. ఈ హాస్టళ్లను సామాజిక న్యాయ హాస్టళ్లుగా పిలిచే విధంగా ఉత్తర్వులుజారీ చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని, నేటి యువకులందరూ, కులమతాలకు అతీతంగా, ఐక్యంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
పునరావాస శిబిరాలలో గృహాలు
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విల్లుపురం, తిరుప్పూర్, సేలం, ధర్మపురి, విరుదునగర్ జిల్లాల్లోని శ్రీలంక తమిళుల పునరావాస శిబిరాలలో రూ. 38.76 కోట్లతో కొత్తగా నిర్మించిన 729 గృహాలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ శిబిరాలలో రూ.7.33 కోట్లతో పూర్తి చేసిన కాలువలు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలతో పాటుగా ఇతర ప్రాథమిక సౌకార్యలను శ్రీలంక తమిళులకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్, ఎస్.ఎం. నాసర్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. మురుగానందం, తదితరులు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ శాఖ తరపున ధర్మపురి జిల్లాలో రూ.36.62 కోట్లతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. రూ. 18.18 కోట్లతో మదురై జిల్లా – మేలూర్, ధర్మపురి జిల్లా – పెన్నాగారం, తూత్తుకుడి జిల్లా – ఒట్టపిడారం మరియు దిండిగల్ జిల్లా –దిండిగల్ పశ్చిమం తాలుకా కార్యాలయాలకు భవనాలనుప్రారంభించారు. కన్యాకుమారి జిల్లా – తక్కలై , కడలూరు జిల్లా – బన్రూటిలో రూ. 65 లక్షల 76 వేలతో నిర్మించి రెండు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకార్యాలయాల భవనాలుకూడా ప్రారంభించారు.
యాత్రకు ఆర్థిక సాయం
తమిళనాడు నుంచి బౌద్ధ, జైన, సిక్కు సమాజిక వర్గాలు వారి పురాతన, పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే రీతిలో ఈసందర్భంగా సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముస్లీంలకు హజ్‌యాత్రకు, క్రైస్తవులకు జెరూసలెం సందర్శనకు, హిందువులకు మానస సరోవరం, కేథార్ నాథ్‌ల సందర్శనకు కల్పిస్తున్న రాయితీలు, ఆర్ధిక సాయం తరహాలో తమిళనాడు ప్రభుత్వ సమానత్వ వైఖరి మత సామరస్యంను ఉదాహరిస్తూ బౌద్ధమతం, జైన, సిక్కు మతంలోని వారు వారి పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సాయం ప్రకటనతో సీఎం స్టాలిన్‌ను రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులు పొన్.రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ తాటియా , రమిత్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ 9,10 తేదీలలో క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం తిరువారూర్‌కు వెళ్లనున్నారు. ఇక్కడరోడ్ షోతో ప్రజల్ని కలిసేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కాగా, సోమవారం ఒక్క రోజు సీఎం స్టాలిన్ పది శాఖల అఽధికారులు, మంత్రులతో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి సమీక్షా సమావేశాన్ని వేర్వేరుగా నిర్వహించారు. ప్రకటనలు ఉత్తర్వులు కావాలని ఈసందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. తాను ఇచ్చి కొత్త సూచనలు, ప్రకటనలన్నీఅ మల్లోకి వచ్చే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టులు, పథకాల అమలు మరింత వేగం పెంచాలని ఆదేశించారు.
పేర్ల మార్పునకు సీఎం ఆదేశాలు
పునరావస శిబిరాలలో గృహాలు
పది శాఖల అధికారులతో సమీక్ష

ఇక, సామాజిక న్యాయ హాస్టళ్లు