
మామిడి రైతులను ఆదుకోవాలని బీజేపీ ధర్నా
వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు దశరథన్ అద్యక్షతన ఆ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాత్యాయిని మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధరలు లేక రైతులు పండించిన పంటలను మార్కెట్‌లో విక్రయం చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం సరికాదన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రంలోని జాస్ ఫ్యాక్టరీలకు మామిడిని తరలించి విక్రయించుకునే వారిని ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రానికి మామిడిని తీసుకెళ్లలేక సరిహద్దు ప్రాంతంలోనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అధికంగా వేలూరు, సేలం జిల్లాలోనే మామిడి పంటలపై రైతులు ఆధారపడి జీవిస్తున్నారని రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.