
స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
వేలూరు: నిరుపేదలు స్వయం ఉపాధిని ఎంచుకుని, తద్వారా అభివృద్ధి చెందాలని రెప్‌కో బ్యాంక్ చైర్మన్, రెప్‌కో హోమ్ పైనాన్స్ డైరెక్టర్ సంతానం తెలిపారు. తమిళనాడు నుంచి ఇతర దేశాలకు వెళ్లి, తిరిగి స్వదేశాలకు వచ్చిన వారికి వేలూరు బ్రాంచ్ రిటర్నీస్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, వారి పిల్లలకు విద్యా స్కాలర్‌షిప్‌లు పంపిణీ కార్యక్రమం వేలూరు బ్రాంచ్ మేనేజర్ విఘ్నేశ్వరి అధ్యక్షతన శనివారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రెప్‌కో బ్యాంకు నిరుపేదలకు చేరువలో ఉందన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి సభ్వత్యం చేయించి, వారి పిల్లలను ఆదుకునేందుకు అవసరమైన సహకారం అందజేస్తుందన్నారు. ప్రస్తుతం నిరుపేద మహిళలను గుర్తించి, కుట్టు మిషన్లు అందజేస్తున్నామని, వీటి ద్వారా మీ ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. అన్ని బ్యాంకుల కన్నా తక్కువ కాలంలో రుణాలు అందేలా తమ బ్యాంకు సిబ్బంది అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రెప్‌కో బ్యాంక్ హోమ్ పైనాన్స్ వేలూరు రీజినల్ మేనేజర్ ఖాదర్‌బాషా, బ్యాంక్ కౌన్సిల్ ప్రతినిధి ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు.