
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
● అయత్తూరులో స్థానికుల రాస్తారోకో ● గుంతలో పడి ఒకరు.. లారీ ఢీకొని మరొకరు మృతి
తిరువళ్లూరు: రోడ్డు నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి రైల్వే విశ్రాంత ఉద్యోగి మృతి చెందగా, మట్టి లారీ ఢీకొని మరో వృద్ధుడు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా బుజ్జిన్‌కండ్రిగ గ్రామానికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి కృష్ణన్(70) ఆదివారం రాత్రి అయత్తూరులో జరిగిన అమ్మవారి జాతర ఉత్సవాలకు హాజరయ్యారు. రాత్రి పది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. అయత్తూరుకు సమీపంలో వెళ్తున్న సమయంలో ఎన్నూరుపోర్టు–మహాబలిపురం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గుంతల్లో పడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇతడి కోసం రాత్రంతా బంధువులు గాలించినా ఫలితం లేకపోగా సోమవారం అయత్తూరు వద్ద గుంతలో శవమై కనిపించాడు. రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్విన క్రమంలో అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడంతోనే ప్రమాదం జరిగి వృద్ధుడు చనిపోయాడని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న సెవ్వాపేట ఇన్‌స్పెక్టర్ జయకుమార్ సంఘటన స్థలానికి హాజరై ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఇకపై రోడ్డు నిర్మాణం కోసం తవ్వకాలు చేపడితే అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హమీ మేరకు స్థానికులు ఆందోళన విరమించారు.
మట్టి లారీ ఢీకొని..
తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా మట్టి క్వారీలు పదుల సంఖ్యలో నడుస్తున్నాయి. క్వారీల నుంచి మట్టితో వెళ్తున్న లారీలు అతివేగంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో విడయూర్ క్వారీ నుంచి మట్టితో లారీ సోమవారం ఉదయం బయల్దేరింది. పట్టణంలోని రైతు బజారు వద్ద వెళ్తుతున్న సమయంలో ముందుగా ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టడంతో అతడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను ఆరా తీశారు. మృతుడు సీయంజేరి గ్రామానికి చెందిన లోకనాథన్(67)గా గుర్తించారు. ఇతను భార్య జగదీశ్వరితో కలిసి జయానగర్‌లో నివాసం ఉంటున్నాడు. కూరగాయలు కొనడానికి వెళ్తుతున్న సమయంలోనే ప్రమాదానికి గురై, సంఘటన స్థలంలోనే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి