
నాకు న్యాయం చేయండి!
● వివాహితతో ఆంధ్ర యువకుడు సహజీవనం ● రాసలీల వీడియో స్నేహితులకు షేర్‌పై ఎస్పీకి ఫిర్యాదు
తిరువళ్లూరు: వివాహితతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి బెదిరింపులకు దిగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ న్యాయవాదులతో కలిసి ఎస్పీ శ్రీనివాసపెరుమాల్‌కు వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరుజిల్లా ఆర్కేపేట ఎస్వీజీపురం ప్రాంతానికి చెందిన కౌసల్య(35)కు వివాహమై, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో చిత్తూరుజిల్లా పాలసముద్రం మండలం వెంగళరాజకుప్పం గ్రామానికి చెందిన ప్రిద్విన్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగించాడు. ఈ క్రమంలోనే గత నెల 10 తేదీన ప్రిద్విన్ సెల్‌ఫోన్‌ను కౌసల్య పరిశీలించగా ఇద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించడంతో షాక్‌కు గురైంది. ఈ విషయమై అతడ్ని నిలదీయగా విషయాన్ని బయటకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించాడు. పోలీసులకు వెళితే హత్య చేస్తామని బెదిరించాడు. దీంతో కౌసల్య ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇన్‌స్పెక్టర్ జ్ఞానశేఖరన్, ఎస్‌ఐ రాకీకుమారి విచారణ చేపట్టారు. ఇద్దరి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఆర్కేపేట పోలీసులు తనకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ బాధితురాలు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్‌కు న్యాయవాదులతో కలిసి ఫిర్యాదు చేసింది. ప్రిద్విన్‌తోపాటు అతడి పిన్ని ఉమ, బంధువు పయణి, స్నేహితుడు అయ్యప్పన్ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వివరించింది. అలాగే మానవహక్కుల సంఘం, మహిళ కమిషన్, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి సైతం ఫిర్యాదు చేసినట్టు న్యాయవాదులు తెలిపారు. కాగా కౌసల్య ఫిర్యాదుపై అడిషనల్ ఎస్పీ హరికుమార్ విచారణ జరిపారు. కాగా ఆర్కేపేట పోలీసులు ఈ విషయమై వివరణ ఇస్తూ కౌసల్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపామని, అయితే ప్రిద్విన్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని వీడియోలు, ఫొటోలను ల్యాబ్‌కు పంపి నిగ్గుతేలుస్తామన్నారు. ఇది ఇలా వుండగా ప్రిద్విన్‌కు ఇటీవల పెళ్లి చూపులు చూడడంతో కౌసల్యకు దూరం అయినట్టు తెలుస్తుంది. తనతోపాటు కలిసి జీవించాలని కౌలస్య కోరడం, అందుకు ప్రిద్విన్ నిరాకరించడంతోనే వివాదం మొదలైందని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

నాకు న్యాయం చేయండి!