
మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడే కుయిలి
తమిళసినిమా: వినోదాన్ని అందించే కథా చిత్రాల మధ్యలో మంచి సందేశంతో కూడిన ఆలోచింపజేసే ప్రయోజనాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలా ప్రజలకు ప్రాణాంతకమైన మద్యంపై అవిరామంగా పోరాడే కథా చిత్రాలు అప్పుడప్పుడే వస్తుంటాయి. అలాంటి కథతో తాజాగా రూపొందిన చిత్రం కుయిలి. స్వలాభం కోసం ప్రజలను మద్యానికి బానిసలను చేసే దుర్మార్గుడు వారి ప్రాణాలను బలి కొంటూ తన మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతుంటారు. అలా ఒక గ్రామ ప్రజలు సహనం కోల్పోయి తిరగబడితే జరిగే పరిణామాలే కుయిలి చిత్ర కథ. సారాయి కారణంగా తండ్రిని కోల్పోయిన ఒక యువతి, ఎలాంటి వ్యసనాలు లేని యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆర్ధిక సమస్యలు అతన్ని మద్యానికి బానిసను చేస్తాయి. ఈ తరువాత అతను ప్రాణాలను కోల్పోతాడు. అంతకు ముందు నుంచే కామ్రేడ్స్ కొందరు మద్యం సేవించడం వల్ల జరిగే నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ప్రయోజనం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మద్యం కారణంగా బలైన తండ్రీ, భర్తలను కోల్పోయిన ఈ యువతి పోరాటానికి దిగుతుంది. ఎలాగైనా మద్యాన్ని ఆ ఊరులో లేకుండా చేయాలని కామ్రేడ్ మిత్రులతో కలిసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పోరాడుతుంది. తన కొడుకును కష్ట పడి చదివించి కలెక్టర్‌ను చేసి మద్యానికి చరమగీతం పాడాటానికి శ్రమిస్తుంది. అయితే ఆమె పోరాటం ఫలించిందా? కలెక్టర్ అయిన కొడుకు తల్లి ఆశయానికి అండగా నిలిచాడా? వంటి పలు అంశాలతో రూపొందిన చిత్రం కుయిలి. ఒక యధార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని పీఎం.ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వీ.అరుణ్‌కుమార్ నిర్మించారు. పీ.మునుసామి దర్శకత్వం వహించిన ఇందులో నటి లిజీ ఆంటోని టైటిల్ పాత్రను పోషించగా రవిషా, దష్మిక ,దీప్తీ, పుదుపేట్టై సరవణన్, రాక్షసన్ సరవణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జూ స్మిత్ సంగీతాన్ని, ప్రవీణ్‌రాజ్ ఛాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం గురువారం శుక్రవారం తెరపైకి రానుంది.
కుయిలి
చిత్రంతో
నటి లిజీ ఆంటోని