
వేడుకగా ఆణి తిరుమంజన ఉత్సవాలు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని శివాలయాల్లో ఆణి తిరుమంజన ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. తమిళ ఆణిమాస తిరుమంజన దినోత్సవాన్ని పురష్కరించుకొని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని శివగామి సుందరి సమేత నటరాజ పెరుమాల్‌కు ఉదయం 6 గంటలకు శివాచార్యులచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం స్వామి వారికి కర్పూర హారతులు పట్టి వేద మంత్రాలు చదివారు. ఈ విశేష పూజలను తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వార్లును వివిధ వాహనాల్లో ఆశీనులు చేసి మాడ వీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వార్లుకు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా వేలూరు కోట మైదానంలోని శ్రీ జలకంఠేశ్వరాలయంలోని శ్రీ శివగామి సుందరి సమేత నటరాజ పెరుమాల్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామివార్లును పట్టణంలో ఊరేగించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.