
తమిళనాడు ప్రజలందర్నీ ఒకే జట్టుగా, ఒకే వేదిక మీద తెచ్చే
● ఇంటింటా కార్యక్రమంతో ప్రజలలోకి.. ● 45 రోజుల ప్రచార పర్యటనకు స్టాలిన్ శ్రీకారం
సాక్షి, చైన్నె: 2026లో మళ్లీ అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయంతెలిసిందే. పార్టీ పరంగా నేతలను అప్రమత్తం చేస్తూ, ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడంతా బలోపేతం దిశగా కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఈ వ్యూహాల అమలులలో భాగంగా తమిళనాడు అంతా ఒకే జట్టు అన్న నినాదంతో ప్రజలను ఏకం చేసే కార్యక్రమానికి చర్యలు తీసుకున్నారు. చైన్నెలోని అన్నా అరివాలయం వేదికగా ఈ కార్యక్రమాని స్టాలిన్ ప్రారంభించారు.
45 రోజుల ప్రత్యేక కార్యక్రమం
ఒకే జట్టుగా తమిళనాడు కార్యక్రమం గురించి డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ మీడియాకు వివరించారు. ఇది 45 రోజుల కార్యక్రమంగా పేర్కొన్నారు. ఇదిక మహోన్నత కార్యక్రమంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని 38 జిల్లాలలో ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లాల కార్యదర్శులు మీడియా ముందుకు వచ్చి ద్రావిడమోడల్ ప్రభుత్వం ఆయా ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారన్నారు. అలాగే, 78 జిల్లా కార్యదర్శుల నేతృత్వంలో ఒకే జట్టుగా తమిళనాడు నినాదంతో జిల్లాల వారీగా సభలు జరుగుతున్నాయారు. జూలై 7 నుంచి ఇంటింటా ప్రజల్ని కలిసే కార్యక్రమాలు ఉంటాయన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాలలో ప్రజలతో మమేకం అయ్యే విధంగా ఇంటింటా వెళ్తారని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తారన్నారు. ఈ కార్యక్రమం కోసం డీఎంకే ఐటీ విభాగం నేతృత్వంలో 234 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. వీరి ద్వారా 68 వేల పోలింగ్ బూత్‌కమిటీలు, డిజిటల్ ఏజెంట్లు ప్రజల్ని కలిసి తమిళనాడు, తమిళ భాష, భూమిని రక్షించుకునేందుకు ఏకం అవుద్దామన్న నినాదంతో అందర్నీ ఒకే తాటి పైకి తీసుకొస్తారని వివరించారు. తమ ప్రగతి, కేంద్రంలోని బీజేపీ పాలకుల మోసాలు, నిధుల కేటాయింపు విషయంలో తమిళనాడుకు తలబెట్టిన ద్రోహం వంటి అంశాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజలలోకి వెళ్లడం జరుగుతుందన్నారు. ఈసందర్భంగా అనేక సంఘటనలను ఉదాహరణగా గుర్తు చేశారు.
అందరి ఇళ్లకూ వెళ్తాం..
కేంద్రంలోని పాలకులను ధైర్యంగా ఎదిరించి నిలబడే పార్టీకి బ్రహ్మాండ ప్రజా వేదిక అవశ్యమన్నారు. అందుకే తాము ఒకే జట్టుగా తమిళనాడు నినాదాన్ని అందుకున్నామన్నారు. తాము ఏమి చేశామో అన్నది ప్రజలకు తెలుసునని, అయినా, వారికి ఓ మారు గుర్తు చేయడం లక్ష్యంగా ఈ 45 రోజుల ప్రచార కార్యక్రమాలు, కరపత్రాల పంపిణి విస్తృతంగా చేయనున్నామన్నారు.అదే సమయంలో సభ్యత్వ నమోదు సైతం జరుగుతుందన్నారు. ప్రతి పక్ష నేతల ఇళ్లకే కాదు, ఇష్ట పడే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పరిస్థితిని బట్టి స్థానికంగా ఉండే నేతలు ప్రతి పక్ష నేత పళణి స్వామి ఇంటికి సైతం వెళ్లేందుకు వెనక్కు తగ్గరన్నారు. ప్రజలలోకి పళణి స్వామి ఇప్పుడిప్పుడే వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, తాము నిత్యం ప్రజలలోనే ఉన్నామని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే కూటమి పార్టీల సీట్ల పందేరం గురించి ప్రశ్నించగా, ఎన్నికలకు 10 నెలలు సమయం ఉందని, సందర్భానుగుణంగా అందరూ కూర్చుని చర్చించి మాట్లాడుకుంటామని, సర్దుబాటు చేసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ప్రజలందర్నీ ఒకే జట్టుగా, ఒకే వేదిక మీద తెచ్చే