తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్‌ నిలిపివేత | Goods Train Fire Accident Carrying Diesel In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడు: రైలు నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. ట్రైన్స్‌ నిలిపివేత

Jul 13 2025 9:41 AM | Updated on Jul 13 2025 12:11 PM

Goods Train Fire Accident Carrying Diesel In Tamil Nadu

సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తిరువళ్లూరులో డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో, వ్యాగన్లు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే, ట్రాక్ సమీపంలోని ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు.

వివరాల ప్రకారం.. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న గూడ్స్ రైలులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పెరియకుప్పం సమీపంలో గూడ్స్‌ రైలులో మంటలు వ్యాపించాయి. ఓడరేవు నుండి చమురుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు కావడంలో మంటలు చెలరేగుతున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపిస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్ళూరు ఎస్టీ కాలనీ, వరదరాజ నగర్‌కు చెందిన 300 కుటుంబాలను జిల్లా అధికారులు ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి తిరువళ్ళూరు కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస్ పెరుమాళ్, రైల్వే డీఆర్‌ఎం విశ్వనాథన్ చేరుకున్నారు.

ఇక, గూడ్స్‌ రైలుకు మొత్తం 52 ట్యాంకర్లు ఉండగా.. ఇంజన్ వైపున రెండో ట్యాంకర్ నుండి తొమ్మిదో ట్యాంకర్ వరకు వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అగ్ని  ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ట్యాంకర్లు అగ్నికి ఆహుతి కాగా.. మిగిలిన ట్యాంకర్లను అధికారులు రైలు నుంచి సురక్షితంగా తప్పించినట్టు సమాచారం. 40 ట్యాంకర్లు సురక్షితంగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్‌లో 70వేల లీటర్లు క్రూడ్ ఆయిల్ ఉంది.

 

 అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదికి పైగా అగ్నిమాపక యంత్రాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల కారణంగా, అరక్కోణం మీదుగా సెంట్రల్‌కు వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వివిధ ప్రదేశాలలో నిలిపివేశారు. అదనంగా ఉదయం 5.50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైలును కూడా నిలిపివేశారు. తిరుపతి, వేలూరు, మైసూరు, సేలం నుంచి చెన్నైకు వెళ్ళే రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement