సాక్షి, చైన్నె: ఆధునిక సాంకేతితను అందింపుచ్చుకుని ప్రతి రంగాన్నీ మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్లాల్సిన అవశ్యం ఉందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. నేటి కాలంలో ప్రతి ఇంటి గణాంకాలు తప్పడం లేదని, బడ్జెట్ వేసుకుని మరీ జీవిత పయనాన్ని లాగే వారే ఎక్కువగా ఉన్నట్టు వివరించారు. చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్ ఆడిటోరియంలో సోమవారం 19వ జాతీయ గణాంక దినోత్సవ వేడుక జరిగింది. డేటా ఆధారంగా ప్రత్యేక అంశాలను సిద్ధం చేసే విధంగా రాష్ట్ర, జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీలలో విజేతలకు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థుల కోసం నాన్ మొదల్వన్ పథకం ద్వారా అందిస్తున్న శిక్షణ, ఇందులో భౌతిక శాస్త్రం, గణిత విభాగంలో నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి అవగాహన ఒప్పందాలు ఉదయ నిధి సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా ఉదయనిధి ప్రసంగిస్తూ జాతీయ గణాంక దినోత్సవం గురించి గుర్తు చేస్తూ, అనేక మంది లెక్కలలో తడపడటం సహజమేని వివరించారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలు గణాంకాల వివరాలను వెల్లడించేవి అని పేర్కొంటూ, నేడు ప్రతి ఇంటికి గణాంకాలు తప్పనిసరి అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నెల వారీ బడ్జెట్, వార్షిక బడ్జెట్ అంటూ ప్రతి ఒక్కరూ గణాంకాలకు వేసుకుని ముందుకు సాగాల్సి ఉందన్నారు. తమిళనాడులో చాలా కుటుంబాలు లెక్కల ఆధారంగానే జీవనం సాగించడం అలవాటు చేసుకుని ఉన్నారన్నారు. గణంకాలు వివిధ కేటగిరిలుగా అభివృద్ది చెంది ఉన్నాయని గుర్తు చేస్తూ, అయితే, ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ యుగంలో జీవిస్తున్నామన్నారు. దీనికి మరింత లోతైన డేటా అవసరం అని, కృత్రిమ మేధస్సుకే కాదు, మంచి కోసం కూడా ప్రభుత్వానికి ఖచ్చితమైన డేటా చాలా కీలకంగా పేర్కొన్నారు.
ఇంటింటా గణాంకాలు తప్పనిసరి
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
ప్రత్యేక విభాగం
అందుకే నేడు గణాంకాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఉన్నారని గుర్తు చేస్తూ, ఈ రంగంలో మరింత ఆధునిక సాంకేతికతను అందిం పుచ్చుకోవాలని సూచించారు. ద్రావిడ మోడల్ పాలనలలో ప్రభుత్వ పథకాలు మేరకు ప్రజలకు దరిచేరాయో, వారి జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నాయో అన్నది కూడా తెలుసుకునే విధంగా గణాంకాలు కీలకంగా ఉన్నాయని వివరించారు. ఈ విభాగం ఇచ్చే ఆధారాలతో ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా గణాంకాల రూపంలో తెలియజేయడం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని సార్లు కొన్ని గణాంకాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదని గుర్తు చేస్తూ, వాస్తవ సామాజిక పరిస్థితి గురించి మరింత పరిశోధనల కోసం ఈ గణాంకాల ప్రాజెక్టు మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రజలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలనుకుంటున్న, చేసే పాలకులకు ఈ విభాగం వెన్నెముకగా ఉండాలని పిలుపు నిచ్చారు. గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఎలాంటి ట్రెండ్స్ ఉన్నాయి? అది ఏమి చూపిస్తున్నాయి? అన్నది సరిగ్గా అర్థం చేసుకుని, అవగాహన పెంచుకుని ఈ రంగం మరింత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జె. జయరంజన్, ప్రణాళిక, అభివృద్ధి విభాగం అదనపు డైరెక్టర్, ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, కమిషనర్ ఆర్. జయ, తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహణ డైరెక్టర్ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ఆధునిక సాంకేతికతతో మరింత అభివృద్ధి