
8న చైన్నెకి అమిత్ షా
● కోవైలో బల ప్రదర్శనకు పళని వ్యూహం
సత్తా తెలియజేసేందుకు..
సాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 8న చైన్నెకు రానున్నారు. అదే సమయంలో కొంగు మండలంలో ప్రధాన కేంద్రంగా ఉన్న కోయంబత్తూరులో తన బలాన్ని చాటే ప్రదర్శనకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహ రచనకు సిద్ధమయ్యారు. వివరాలు.. బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు మళ్లీ కుదిరినా, బల పడేందుకు సమయం పట్టేలా ఉంది. ఇందుకు కారణం బీజేపీ వర్గాలు ఓ వైపు అధికారంలోకి వస్తే సంకీర్ణ ప్రభుత్వం అన్న నినాదాన్ని అందుకోవడమే. దీనికి ప్రాంతీయ పార్టీలైన డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు ఇప్పటికే మద్దతు ఇచ్చాయి. అదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, సీఎం అభ్యర్థి ఎవరో అన్న విషయంలో గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో కొత్తచర్చకు దారి తీశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి సీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే, అమిత్ షా పళణిస్వామి పేరు ప్రస్తావించక పోవడం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది.
తన పేరును సీఎం అభ్యర్థిగా అమిత్ షా ప్రస్తావించక పోవడాన్ని పళణి స్వామి తీవ్రంగా పరిగణించారు. ఈనెల 8వ తేదీన చైన్నెకు అమిత్ షా వస్తున్న సమయంలో తన బలాన్ని చాటే ప్రదర్శనకు కొంగు మండలంలోని ప్రధాన కేంద్రంగా ఉన్నకోయంబత్తూరును వేదికగా ఎంపిక చేసుకున్నారు. చైన్నెలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే అమిత్ షాకు అన్నాడీఎంకే బలం ఏమిటో, తన సత్తా ఏమిటో పరోక్షంగా నిరూపించే దిశగా కోయంబత్తూరులో భారీ ప్రదర్శనకు 7, 8 తేదీలలో పళణిస్వామి నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 7వ తేదీ నుంచి పళణిస్వామి రాష్ట్ర పర్యటనకు కోయంబత్తూరు నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఇదే అదనపుగా ఈ పర్యటన తొలి రెండు రోజులు రాష్ట్రమే కోయంబత్తూరు వైపుగా దృష్టి పెట్టే విధంగా బల ప్రదర్శనకు వ్యూహరచన చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో పార్టీ వర్గాలు కొంగు మండలంలో భారీ జన సమీకరణకు సిద్ధమవుతున్నారు. చైన్నెకు వచ్చే అమిత్ షా నోటి నుంచి అన్నాడీఎంకే నేతృత్వంలో తమిళనాట అధికారం,సీఎం అభ్యర్థి పళని స్వామి అని పలికించే వ్యూహంతో ఈ బల ప్రదర్శన వేదిక కానున్నడం గమనార్హం.